Chain Snatcher Arrest: హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో నిన్న(మార్చి 29) సాయంత్రం ఓ గొలుసు దొంగతనం జరిగింది. కమల అనే మహిళ మెడలో నుంచి ఓ దొంగ.. బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో కింద పడిపోయిన కమల తలకు తీవ్ర గాయాలయ్యాయి. దొంగ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. దర్యాప్తులో భాగంగా సాంకేంతికతను ఉపయోగించిన పోలీసులు.. నిందితుని వివరాలు కనుగొన్నారు. ఇక్కడి నుంచి.. సింగం-3(S-III) సినిమాలోని సన్నివేశమే రిపీట్ అయ్యింది.
నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హేమంత్గా గుర్తించారు. టెక్నాలజీ సాయంతో నిందింతుడు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. దిల్లీ పారిపోతున్నట్టు తెలియడంతో.. వెంటనే ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పీఎస్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈరోజు(మార్చి 30) ఉదయం 5 గంటలకు సమాచారం అందుకున్న ఔట్‌పోస్ట్ పోలీసులు.. శంషాబాద్ విమానాశ్రయ భద్రతా సిబ్బందితో కలిసి అంతా గాలించారు. చివరికి.. దిల్లీ వెళ్లే జెట్‌ఎయిర్‌వేస్ విమానంలో నిందితుడు ఉన్నట్టు గుర్తించారు. రన్‌వేపై ఉన్న విమానం దగ్గరికి వెళ్లి.. నిందితున్ని అదుపులోకి తీసుకుని రాచకొండ పోలీసులకు అప్పజెప్పారు. అతడి దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.