జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేస్తున్నారని పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రవీందర్ తెలిపారు. రామగుండం ఏరియాలో సింగరేణి కార్మికుడు అజ్మీరా వెంకటేశ్వర్లు మార్చి 24న ఇంటికి తాళం వేసి రాత్రి డ్యూటీకి వెళ్లారని పేర్కొన్నారు. అదే అదునుగా భావించిన ప్రణయ్ కుమార్, ఇన్సుల కిరణ్, రవితేజ, వసంతకుమార్, ప్రీతమ్ తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.రెండున్నర లక్షలు విలువ చేసే 7 తులాల బంగారు నగలు, రూ.2 వేల నగదును అపహరించారని వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
జల్సాలకు అలవాటు పడిన ఐదుగురు యువకులు దొంగతనాల బాటపట్టారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి చోరీలు చేసి చివరకు కటకటాల పాలయ్యారు. వీరిపై కేసు నమోదు చేసి.. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు డీసీపీ రవీందర్ వివరించారు.
విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న వెంకటేశ్వర్లు... దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎనిమిదో కాలనీలో వాహనాల తనిఖీల్లో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితులను త్వరగా పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపి ఉమెంధర, సీఐ శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు, ఎసైలు శ్రీనివాస్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కోడేరులో అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని తహసీల్దార్