Mine Tragedey: ఓ వైపు భారీఎత్తున కూలిన బొగ్గు బండ శిథిలాలు.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని సంఘటన స్థలం.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా బొగ్గు పొరల కింద ఉన్న వారికి ప్రమాదం.. దీంతో రెస్క్యూ సిబ్బంది ఆచితూచి ముందడుగు వేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రికే 36 గంటలు దాటింది.. సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు(ఏఎల్‌పీ) బొగ్గు గనిలో చిక్కుకున్న ఇద్దరి కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, కార్మికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారీగా బొగ్గు బండలను తొలగించడానికి రెస్క్యూ సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గనిలోకి దిగిన సిబ్బంది ముగ్గురిని రక్షించగా, మరో ఇద్దరి ఆచూకీ కనిపెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జాడి వెంకటేశ్వర్లు, పిల్లి నరేశ్, ఎరవేణి రవీందర్‌లను సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ సభ్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నాలుగు షిఫ్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎంతో ఓర్పుతో ప్రయత్నాలను చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి అసిస్టెంట్ మేనేజర్ చైతన్యతేజ మృతదేహాన్ని గుర్తించగా, ప్రాంత రక్షణ అధికారి జయరాజ్, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్‌లకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. వారు ఎటువైపు ఉన్నారన్నది అంతు చిక్కడం లేదు.
మృత్యుంజయుడు రవీందర్
బొగ్గుగని మట్టి దిబ్బల నుంచి బయటపడి బదిలీ వర్కర్ రవీందర్ మృత్యుంజయుడిగా మిగిలాడు. కాలికి తీవ్రగాయమైనప్పటికి అతని ధైర్యాన్ని అభినందించారు. బొగ్గు పొరల్లో చిక్కుకుపోయిన నలుగురు కార్మికుల కోసం సహాయక బృందం పెద్ద యజ్ఞమే చేసింది. యంత్రాల ద్వారా సునాయాసంగా మట్టిని బొగ్గును తొలగించే భారీ యంత్రాలు అందుబాటులో ఉన్నాకార్మికుల ప్రాణాలను కాపాడటానికి గంటలకొద్ది శ్రమించారు.ఈనెల 7వతేదీ మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో గనిలోని సైడ్‌వాల్‌తో పాటు పైకప్పు కూలడంతో కార్మికులు అందులో కూరుకు పోయారు. వారిని బయటికి తీయడానికిగాను ఒక్కో అంగుళం చొప్పున బొగ్గు మట్టిని తొలగించారు.భారీ శిథిలాల్లో తొలగించడానికి సహాయక బృందం చేసిన ప్రయత్నాలను పలువురు అభినందించారు.పూర్తిగా శిథిలాల్లో కూరుకు పోయిన రవిందర్‌కు ఒకవైపు ఆక్సిజన్ పంపిస్తూనే మరోవైపు అతనిని వెలికి తీసే ప్రయత్నం చేశారు.శిథిలాల్లో కూరుకు పోయినా ధైర్యాన్ని కోల్పోకుండా సహాయం చేయమంటూ అరుస్తూనే ఉన్నాడు. అతనిని దాదాపు 24గంటల తర్వాత శిథిలాల్లో నుంచి వెలికి తీశారు.అతను శిథిలాల్లో నుంచి బయటికి రాగానే తోటి కార్మికుల గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు.
గుహలా తవ్వుకుంటూ..
భారీఎత్తున కూలిన బొగ్గుబండ కింది భాగం నుంచి రెస్క్యూ సిబ్బంది తవ్వుకుంటూ వెళ్తున్నారు. పైబొగ్గు బండలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేతులతో బొగ్గు బండను తోడుతూ ముందుకెళ్తున్నారు. రామగుండం, మందమర్రి, భూపాలపల్లి రెస్క్యూ స్టేషన్‌లకు చెందిన 300 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్న సిబ్బంది ముందుగా వారు పనిచేస్తున్న ప్రాంతానికి రక్షణ కల్పించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఎప్పటికి పూర్తయ్యేనో..
ప్రస్తుతం ముగ్గురి అన్వేషణకు చేపట్టిన సహాయక చర్యలు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం ఉంది. అప్పటివరకు కూడా ఆచూకీ లభిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నారు. అక్కడి పరిస్థితుల ఆధారంగా తెల్లవారుజాము వరకు కూడా వారిని గుర్తించే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ