వికారాబాద్ జిల్లా తాండూర్లోని వడ్డెర ఢిల్లీకి చెందిన పింకు, మల్రెడ్డిపల్లికి చెందిన టింకు, తాండూర్ మండలం అనంతారానికి చెందిన రింకు ముగ్గురు స్నేహితులు(మైనర్లు అయినందున పేర్లు మార్చబడినవి). పింకు, టింకు.. ఇద్దరు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. రింకు మాత్రం చిన్నచిన్న పనులు చేసుకుంటుంటాడు. టింకు ద్వారా పింకూకు రింకు స్నేహితుడయ్యాడు. ముగ్గురు ఎంతో స్నేహంగా ఉండే వారు. ముగ్గురు కలిసి తరచూ.. కళాశాల మైదానంలో కలుసుకుని కాలక్షేపం చేసేవారు.
అయితే.. వాళ్లు కలుసుకునే కళాశాల మైదానంలో సాయంత్రం పూట స్థానికులు వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ కోసం కొంతమంది ద్విచక్రవాహనాలపై వస్తుంటారు. వాహనదారులు వాళ్ల చరవాణులను బైక్‌కు ఉన్న కవర్లోనే పెట్టి వాకింగ్, వ్యాయామ కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే.. రోజూ అక్కడే కాలక్షేపం చేసే ఈ ముగ్గురు స్నేహితులు.. ఈ విషయాన్ని గమనించారు. ఓ రోజు ముగ్గురు స్నేహితులు ఓ ప్లాన్ వేసుకున్నారు. ద్విచక్రవాహనాల దగ్గరికి వెళ్లారు. అక్కడున్న బైక్‌లను చెక్ చేశారు. వీళ్ల ముగ్గరిలో పింకూకు ఓ బైక్ కవర్లో సెల్‌ఫోన్ దొరికింది. వెంటనే దాన్ని తీసుకుని.. మిగతా ఇద్దరితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సెల్‌ఫోన్‌కు లాక్ ఉండటం వల్ల దాన్ని ఓపెన్ చేయడానికి వీలుకాలేదు. రిపేర్ సెంటర్లో ఇస్తే.. ఏదైనా ఫలితం ఉంటుందేమోనని తలచారు. వెంటనే మొబైల్‌ను తీసుకుని టింకు, రింకు కలిసి పట్టణంలోని మొబైల్ దుకాణానికి వెళ్లారు. సెల్‌ఫోన్‌ని అన్‌లాక్ చేయమని అడిగారు. వాళ్లను, మొబైల్‌ను చూసిన ఆ దుకాణం నిర్వాహకునికి అనుమానం వచ్చింది. ఈ ఫోన్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారని వారిని నిలదీశాడు. దొంగతనం చేశారా..? అని ప్రశ్నించాడు. తటపటాయింటంతో.. ఇద్దరిపై చేయి చేసుకున్నాడు. అన్‌లాక్ చేయమని ఇచ్చిన ఫోన్‌తో పాటు వాళ్ల దగ్గరున్న రెండు చరవాణులకు కూడా తీసుకున్నాడు. ఈ ఫోన్ ఎవరిచ్చారో వాళ్లను తీసుకుని వస్తేనే.. మీ ఫోన్లు ఇస్తానని.. పంపించేశాడు.