దొంగతనాలకు పాల్పడుతూ.. తప్పించుకు తిరుగుతున్న కరడుగట్టిన నేరస్థుడిని హుమాయూన్‌నగర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు నగలు, రూ.10 వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు, చోరీలకు ఉపయోగించే సామగి, ద్విచక్ర వాహనం(ఏపీ 13 జె 2275) స్వాధీనం చేసుకున్నారు.
CRIME: కరడు గట్టిన దొంగ అరెస్టు - Notorious thief was arrested by Humayun Nagar Crime Police
ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 50 సార్లు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. మరో రెండు సార్లు పీడీ చట్టం కింద జైలు శిక్ష అనుభవించాడు. అయినా అతడి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. జైలు నుంచి విడుదలైన వెంటనే తిరిగి చోరీలకు పాల్పడుతున్నాడు. తాజాగా మరోసారి రెండు చోరీ కేసుల్లో పోలీసులకు చిక్కాడు.
పశ్చిమ మండలం సంయుక్త సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, ఏసీపీ ఆర్.జి.శివమారుతీలతో కలిసి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. జూన్ 23న హుమాయూన్‌నగర్‌కు చెందిన షాజహాన్ తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి బయటకు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఇంటి తాళం విరిగిపడి ఉంది. ఇంట్లో నగదు, మూడు తులాల బంగారు నగలు కనిపించలేదు. వెంటనే బాధితురాలు హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దర్యాప్తు మొదలుపెట్టి సీసీ కెమెరాల ఫుటేజిను పరిశీలించారు. గోల్కొండ రేషంబాగ్ నివాసి కారు డ్రైవర్ ముహమ్మద్ ఇబ్రహీం అలియాస్ ముహమ్మద్ ఖలీల్ అలియాస్ బాబా షాట్(44) అనుమానాస్పదంగా కనిపించాడు. వారం పాటు హుమాయూన్‌నగర్ క్రైమ్ పోలీసులు నిందితుడి ఇంటి వద్ద నిఘా ఉంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వీడు సామాన్యుడు కాదు.. నాంపల్లిలో పుట్టి పెరిగిన ముహమ్మద్ ఇబ్రహీం జల్సాలకు డబ్బు కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి, పగలనే తేడా లేకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా.. ఇంటి తాళాలు విరగొట్టి సొత్తు దోచుకుపోతుంటాడు. 2005 నుంచి చాంద్రాయణగుట్టలో 7 కేసుల్లో, లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో 19, గోల్కొండలో 8, చాదర్‌ఘాట్‌లో 4, ఆసిఫ్‌నగర్ ఠాణాలో 5, చిక్కడపల్లిలో ఒకటి, రాజేంద్రనగర్ ఠాణాలో 4, నార్సింగి, కంచన్‌బాగ్, పహాడిషరీఫ్, రాయదుర్గం, బేగంపేట్ ఠాణాల పరిధిలో.. ఇలా మొత్తం 53 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని సీపీ వివరించారు. దాదాపు యాబై కేసుల్లో రిమాండ్‌కు వెళ్లాడన్నారు. ఎక్కువ కాలం జైలులోనే ఉంటాడని తెలిపారు.