తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లి పేరుతో వల.. యువతులకు రూ.లక్షల్లో టోకరా

Cyber crime with marriage proposal : ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. పెట్టుబడులు, లాభాలు, ప్రేమ, పెళ్లి ఇలా రోజుకో పంథాలో సైబర్ మోసగాళ్లు దోచేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. యువతుల నుంచి రూ.లక్షల్లో కొల్లగొట్టిన నైజీరియన్​ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు.

Cyber crime with marriage proposal, cyber crime
యువతులకు రూ.లక్షల్లో టోకరా

By

Published : Jan 5, 2022, 10:14 AM IST

Updated : Jan 5, 2022, 11:07 AM IST

Cyber crime with marriage proposal : ‘'నాపేరు డాక్టర్‌ హెర్మాన్‌. . లండన్‌లో స్థిరపడ్డ భారతీయుణ్ణి. తల్లిదండ్రులు లేరు. కొన్నేళ్లుగా వైద్యనిపుణుడిగా పనిచేస్తున్నాను. వారి కోరిక మేరకు దక్షిణభారతదేశానికి చెందిన యువతిని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి ఉన్నవారు నాతో మాట్లాడండి' అంటూ వివాహవేదికల్లో ప్రకటనలిస్తున్న నైజీరియన్‌ నేరాల చరిత్రను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. కొద్దినెలల్లోనే ఐదుగురు యువతులను మోసం చేసి రూ.52లక్షలు స్వాహా చేశాడని తెలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటాను.. ముందుగా బహుమతులు పంపుతున్నానంటూ ఒయోంకా యువతులతో మాట్లాడేవాడు. బహుమతులుగా పంపిన పౌండ్లు, డాలర్లు, వజ్రాభరణాలు విడిపించుకోవాలంటూ అతడే విమానాశ్రయ అధికారిగా యువతులతో మాట్లాడి రూ.లక్షల్లో నగదు బదిలీ చేయించుకున్నాడు.

యువతి కోసం గాలింపు..

NIGERIAN Cybercrime : ఈ విధంగా పెళ్లిపేరుతో యువతులను మోసం చేస్తున్న నైజీరియన్ ఒయోంకాను పోలీసులు పట్టుకున్నారు. న్యూ దిల్లీలోని జనక్‌పురిలో నివాసముంటున్న ఒయోంకాను.. కొద్దిరోజుల క్రితం ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ బృందం అరెస్ట్‌ చేసింది. న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించగా.. ఐదుగురు యువతులను మోసం చేసినట్టు అతడు అంగీకరించాడు. అతడితో పాటు ఈ నేరంలో దుర్గాదేవి అనే యువతి భాగస్వామ్యం ఉండడంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

పక్కా ప్రణాళికతో..

దక్షిణాఫ్రికాలోని అబాసా నుంచి మూడేళ్ల క్రితం ఒయోంకా సోల్మన్‌ పర్యాటక వీసాతో దిల్లీకి వచ్చాడు. వసంత్‌విహార్, చాణుక్యప్లేస్‌ ప్రాంతాల్లో నివాసముంటున్న నైజీరియన్లను కలుసుకున్నాడు. వారు చేస్తున్న మోసాలను కొద్దినెలల్లోనే తెలుసుకున్నాడు. అనంతరం జనక్‌పురి ప్రాంతానికి మారాడు. అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఒక ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసి అంతర్జాల వివాహవేదికల్లో తనను వైద్యనిపుణుడిగా పరిచయం చేసుకుంటూ వివరాలను అప్‌లోడ్‌ చేశారు. ఈ క్రమంలోనే అసోంకు చెందిన దుర్గాదేవి అనే యువతితో పరిచయమయ్యింది. అమెకు తన పథకాన్ని వివరించగా... అందుకు అంగీకరించింది. అక్టోబరు, 2020 నుంచి ఇద్దరూ కలిసి పెళ్లి పేరుతో మోసాలకు తెరతీశారు. ఒయోంకా యువతులతో మాట్లాడుతుండగా.. దుర్గాదేవి కస్టమ్స్‌ అధికారినంటూ పరిచయం చేసుకుని బాధితుల నుంచి నగదుబదిలీ చేయించేంది. స్వాహా చేసిన సొమ్ములో పదిశాతాన్ని దుర్గాదేవికి ఇచ్చేవాడు.

తస్మాత్ జాగ్రత్త

ఒయోంకా ఒక్కడే కాదు... దిల్లీలో చాలామంది నైజీరియన్లు మోసాలు చేయడానికే దిల్లీకి వస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి రూ.లక్షల్లో కొల్లగొడుతున్న ఆ నైజీరియన్లు... ఎక్కడా కనిపించరని పేర్కొన్నారు. బాధితులు జమచేసిన డబ్బు వేర్వేరు వ్యక్తుల ఖాతాల్లో ఉంటాయని... ఈశాన్య రాష్ట్రాలు, దిల్లీ, నోయిడా, ముంబయి, పుణెల్లో వేర్వేరు పేర్లతో బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తారని చెప్పారు. బాధితులు డబ్బు జమచేయగానే ఆయా ఖాతాల నుంచి దాన్ని వేగంగా తీసేసుకుంటారని వివరించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని... ఆన్​లైన్​ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.

యువతులకు రూ.లక్షల్లో టోకరా

ఇదీ చదవండి:Bulli Bai APP Case: 'బుల్లిబాయి యాప్​ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి'

Last Updated : Jan 5, 2022, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details