వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబం పరువు తీసిందన్న కోపంతో తన కోడల్ని మామ హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చొప్పల సత్యనారాయణ.. కుమారుడు విజయకుమార్‌కు ప్రియమణి అనే యువతితో గతంలో వివాహం జరిగింది. అయితే విజయకుమార్.. ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రియమణి స్థానికంగా ఉన్న వేరే సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఆరేళ్లుగా తన కుమారుడుతో, అత్తమామలతో కలిసి ఉంటున్న ప్రియమణి.. పది రోజుల క్రితం ఆ యువకుడితో వెళ్లిపోయింది. ఈ మేరకు సత్యనారాయణ.. మలికిపురం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు వాళ్లిద్దరిని పట్టుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ప్రియమణిని సత్యనారాయణ ఇంటికి పంపించారు.
మామ.. కోడలు మధ్య వాగ్వాదం
ఈ నేపథ్యంలో తిరిగి ఇంటికి వెళ్లిన కోడలు.. మామ మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన సత్యనారాయణ.. ప్రియమణిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన ప్రియమణి తల్లి మంజులకు స్వల్ప గాయలయ్యాయి. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి లొంగిపోయాడు. ఇంటి పరువు తీస్తుందనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసి రాజోలు సీఐ దుర్గాశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు