Movie Style Theft: స్పెషల్ చబ్బీస్ (26).. 2013 ఫిబ్రవరి 8న విడుదలైంది ఈ హిందీ చిత్రం. ఈ సినిమాలో హీరో అక్షయ్ కుమార్. ఓ ధనవంతుడి ఇంట్లో దోపిడీ చేయడానికి పక్కా ప్రణాళిక రచిస్తాడు. తన బృందంతో కలిసి ఐటీ అధికారులుగా నటిస్తారు. ధనవంతుడి ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు దోచుకుంటారు. ఇదే సినిమాను స్ఫూర్తిగా తీసుకొని దోపిడీకి పాల్పడింది ఓ ముఠా. ఈ నెల 13న సైబరాబాద్ కమిషనరేట్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని జయభేరీ ఆరెంజ్ కౌంటీలో దోపిడీ జరిగింది.
ఐటీ అధికారులమంటూ...
స్థిరాస్తి వ్యాపారి వెంకట సుబ్రమణ్యం ఇంట్లో 1.27 కిలోల బంగారం, నగదు నిందితులు ఎత్తుకెళ్లారు. కారులో వచ్చిన నిందితులు ఇంట్లోకి వెళ్లి ఐటీ అధికారులమంటూ నకిలీ కార్డులు చూపించారు. ఆ సమయంలో వెంకట సుబ్రమణ్యం ఇంట్లో లేరు. వెంటనే ఇంట్లో ఉన్న అందరి సెల్ఫోన్లు లాక్కున్నారు. సుబ్రమణ్యం భార్య జయలక్ష్మి వద్ద లాకర్ తాళంచెవి తీసుకున్న నిందితులు అందులో ఉన్న బంగారు ఆభరణాలు, వజ్రాలు ఎత్తుకెళ్లారు. విషయాన్ని జయలక్ష్మి తన భర్త సుబ్రమణ్యానికి తెలిపింది.
పోలీసులకు ఫిర్యాదు...
ఇంటికి వచ్చిన ఆయన ఐటీ దాడులపై అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు దోపిడీగా తేల్చారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును గుర్తించారు. కారు బాహ్యవలయ రహదారి మీదుగా ఆర్సీపురం వైపు వెళ్లినట్లు గుర్తించారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా... ఆర్సీపురం రైల్వే స్టేషన్ సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దోపిడీ చేసిన మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలా మొదలైంది...
స్థిరాస్తి వ్యాపారి వెంకట సుబ్రమణ్యం... బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో కొన్నేళ్లుగా భువనతేజ్ రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రా పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నారు. కార్యాలయం పక్కనే వైజాగ్‌కు చెందిన మోహన్.. బకెట్ సలాడ్స్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌కు మోహన్ స్నేహితులు సందీప్, అరవింద్ వచ్చి వెళ్తుండేవారు. వెంకట సుబ్రమణ్యం కార్యాలయంలో పనిచేసే జశ్వంత్‌కు మోహన్‌తో పరిచయం ఏర్పడింది. జశ్వంత్ తన యజమాని వెంకట సుబ్రమణ్యానికి... సందీప్, మోహన్‌లను కూడా పరిచయం చేశాడు.
స్పెషల్ చబ్బీస్ స్ఫూర్తితో...
మోహన్ రెస్టారెంట్ బకెట్ సలాడ్స్‌కు వెంకట సుబ్రమణ్యం తరచూ వచ్చి వెళ్తుండేవారు. నెల క్రితం మాదాపూర్‌లో సందీప్ రూమ్‌లో వీరు పార్టీ చేసుకున్నారు. మోహన్, అరవింద్‌తో పాటు జశ్వంత్ కూడా ఈ పార్టీలో పాల్గొని మద్యం సేవించారు. ఈ క్రమంలో జశ్వంత్ తన యజమాని వెంకట సుబ్రమణ్యం ఆస్తుల గురించి ప్రస్తావించాడు. కొన్నేళ్లుగా స్థిరాస్తి వ్యాపారంలో ఎంతో డబ్బు సంపాదిస్తున్నాడని... ఆదాయపు పన్ను మాత్రం చెల్లించడంలేదని జశ్వంత్ చెప్పాడు. ఆయన ఇంట్లో ఎలాగైనా దోపిడీ చేయాలని కుట్ర పన్నారు.