ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ.. 20 మందికి తీవ్రగాయాలు - warangal rural district crime news
09:43 June 19
వరంగల్ గ్రామీణ జిల్లా మందారిపేట వద్ద ప్రమాదం
అతివేగంగా వస్తోన్న ఇసుక లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడగా.. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. హన్మకొండ నుంచి భూపాలపల్లి వెళ్తున్న పరకాల డిపో బస్సు.. మందారిపేట వద్ద ప్రమాదానికి గురైంది. ఇసుక లారీ డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వారి సమాచారంతో.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు తెలిపారు.