అనంతపురం జిల్లాలో మినీ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి - రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
06:19 February 20
మినీ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
Road Accident In Anantapur : మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనే లోపే మృత్యువు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. చిన్నారి పుట్టెంటికలు తీయించుకుని వస్తుండగా.. ఓ కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏపీలోని అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున దంపతులు.. 11 నెలల కుమార్తె పుట్టెంటికలు తీయించేందుకు కుటుంబసభ్యులతో కలిసి మినీ బస్సులో శుక్రవారం తిరుపతి వెళ్లారు. ఆ వేడుక ముగిసిన అనంతరం రాత్రి తిరుగుపయనమయ్యారు. కదిరి- హిందూపురం ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో చలపతి (45), బోగాదమ్మ (40), ఈశ్వరయ్య (18) అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి విధులు ముగించుకుని అటుగా వెళ్తోన్న ఎస్సై గోపీ ప్రమాదాన్ని గుర్తించి.. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. మరికొద్ది నిమిషాల్లో సొంతూరికి చేరుకోవాల్సిన తమ వాళ్లు అనుకోని ప్రమాదానికి గురి కావడంతో క్షతగాత్రుల బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇదీ చూడండి :Prakasham Road Accident: పెళ్లిబాజాలు మోగాల్సిన కుటుంబంలో పెనువిషాదం