Tension in Guddatipally : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో.. అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరో రెండు, మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టుకు ట్రయల్ రన్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే పరిహారం చెల్లించకుండా ట్రయల్‌రన్ ఎలా చేస్తారంటూ భూ నిర్వాసితులు నిలదీస్తుండటంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ట్రయల్ రన్‌ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో గుడాటిపల్లిలో సుమారు 100 మంది భూనిర్వాసితులను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్య గ్రామంలో కెనాల్ కాలువ కోసం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పంపు నీటిని విడుదల చేసి.. ఆ నీటిని ఈ కెనాల్ ద్వారా కుడి, ఎడమ కాలువలకు అనుసంధానం చేసి సాగునీరు విడుదల చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మీడియాను గ్రామంలోకి అనుమతించడం లేదు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వం, అధికారులు సామరస్యంగా తమ సమస్యలను పరిష్కరించాలి కానీ.. అర్ధరాత్రి వేళ పోలీసులతో దౌర్జన్యంగా తమ ఇళ్లపై దాడి చేయించడం ఏంటని భూ నిర్వాసితులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడ-మగ అని తేడా లేకుండా కొట్టించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.