తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder in Mahabubnagar: గుప్త నిధుల జాడ చెప్పలేదని దారుణ హత్య - గుప్త నిధుల జాడ చెప్పలేదని వ్యక్తి దారుణ హత్య

Murder in Mahabubnagar: గుప్త నిధుల జాడ చెప్పలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం మహబూబ్​నగర్​ జిల్లాలో వెలుగుచూసింది. ఈ నెల 4న తన భర్త కనిపించడం లేదంటూ అతని భార్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.

Murder
Murder

By

Published : Jun 6, 2022, 8:16 AM IST

Murder in Mahabubnagar: గుప్త నిధులు వెలికి తీస్తానంటూ నమ్మబలికి మోసం చేసిన ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా రెండో పట్టణ సీఐ సోమ్‌నారాయణ్‌ సింగ్‌ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌ బోయపల్లి గేట్‌ ప్రాంతానికి చెందిన సాయిలు(40) ప్లాస్టిక్‌ సామానులను విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన సోహెబ్‌ బాబా, నురూల్లా, ముంతాజ్‌, కోయిలకొండకు చెందిన శ్రీను, కోయిలకొండ మండలం కన్నయ్యపల్లి తండాకు చెందిన రవినాయక్‌, దేవరకద్ర మండలం లాల్‌కోటకు చెందిన జహంగీర్‌ తదితరులు సాయిలుతో స్నేహంగా ఉండేవారు.

తనకు మంత్రాలు వచ్చని, గుప్త నిధులు ఎక్కడున్నా చెబుతానని వారిని నమ్మిస్తూ ఉండేవాడు. వారి నుంచి అప్పుడప్పుడు డబ్బులు తీసుకునేవాడు. జడ్చర్ల పాత బస్టాండు సమీపంలోని రంగనాథ స్వామి ఆలయం గుట్ట(పెద్ద గుట్ట)పై నిధి ఉందని వారికి చెప్పాడు. మరో వ్యక్తి వెంకటయ్య అలియాస్‌ చిన్నస్వామి నుంచి కూడా అప్పుడప్పుడు డబ్బులు తీసుకున్నాడు. అతడికి కూడా గుప్తనిధుల జాడ చెబుతానన్నాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి సోహెబ్‌ బాబా బృందం సాయిలును తీసుకొని రంగనాథ స్వామి గుట్టపైకి చేరుకున్నారు. అక్కడే గుప్త నిధుల జాడ చెప్పకపోవడంతో గుట్టపైనే అతడిని కొట్టి చంపారు. ఎత్తయిన రాళ్లపై నుంచి లోయలోకి మృతదేహాన్ని పడేశారు.

భార్య ఫిర్యాదుతో.. : సాయిలు భార్య కవిత ఈ నెల 4 రాత్రి రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదని సీఐ సోమ్‌ నారాయణ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ కూపీ లాగటంతో మొత్తం వ్యవహారం బయటపడింది. సాయిలు వెంట వెళ్లిన వారిలో ముగ్గురిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సాయిలు మృతదేహం ఉన్న ప్రాంతాన్ని వివరించారు. వారిని వెంట బెట్టుకొని జడ్చర్లలోని రంగనాథ స్వామి ఆలయం గుట్టకు పోలీసులు చేరుకున్నారు.

సీఐతోపాటు ఎస్సైలు వెంకటేశ్వర్లు, సైదయ్య, సుజాత, క్లూస్‌ టీం సభ్యులు, ఐడీ పార్టీ సిబ్బంది తదితరులు వెళ్లారు. అక్కడ శవం కనిపించలేదు. దుర్వాసన మాత్రం వచ్చింది. గుట్టపై నుంచి చూస్తే శవం కనిపించకపోవడంతో కిందకు దిగారు. 4 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అర కి.మీ. మేర ఉన్న కంపచెట్ల గుండా, రాళ్ల మీదుగా సాయిలు మృతదేహం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. చనిపోయి నాలుగు రోజులు కావడంతో శరీరం నల్లగా మారింది. తమ్ముడు శవం తన అన్నదేనని చెప్పడంతో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, సోమవారం నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని రెండో పట్టణ సీఐ తెలిపారు.

ఇవీ చదవండి:జూబ్లీహిల్స్​ ఘటనలానే పాతబస్తీలో ఇంకోటి.. రెండు కేసుల్లోనూ అవన్ని సేమ్!

ABOUT THE AUTHOR

...view details