తెలంగాణ

telangana

ETV Bharat / crime

Arrest : దుర్వ్యసనాలకు దాసోహం.. పసిపిల్లలపై అత్యాచారం

బతుకుదెరువు కోసం భార్యతో సహా భాగ్యనగరానికి వచ్చాడు. మేస్త్రిగా పనిచేస్తూ జీవనం వెల్లదీస్తున్నాడు. చెడు వ్యసనాల బారిన పడటం వల్ల భార్య విడిచిపెట్టి వెళ్లింది. అప్పటి నుంచి సైకోగా మారిపోయాడు. శారీరక వాంఛ తీర్చుకోవడానికి అభంశుభం తెలియని పసిపిల్లలపై అత్యాచారానికి పాల్పడటం మొదలుపెట్టాడు. పసిపిల్లలనే కనికరం కూడా లేకుండా వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. చిన్నారులు కనిపిస్తే చాలు.. కాటేయడానికి చూసే ఈ కామాంధుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

rape culprit arrested
పసిపిల్లలపై అత్యాచారం

By

Published : Jul 11, 2021, 9:56 AM IST

అతడి కామవాంఛకు వయస్సుతో పనిలేదు. పసిపిల్లలనే కనికరం లేకుండా వారిపై అతిక్రూరంగా అఘాయిత్యాలకు పాల్పడతాడు. చెడు వ్యసనాల బారిన పడటంతో భార్య వదిలిపెట్టింది. అప్పటి నుంచి సైకోగా మారిన ఈ కామాంధుడు.. కనిపించిన చిన్నారులపై అత్యాచారానికి పాల్పడటం మొదలుపెట్టాడు. చిన్నారి బాలికలే లక్ష్యంగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఈ కామాంధుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసై చిన్నారుల పట్ల వికృతంగా ప్రవర్తించే ఈ 40 ఏళ్ల మృగాడి అరెస్టు వివరాలను శనివారం పోలీసులు వెల్లడించారు.

దుర్వ్యసనాలకు దాసోహం..

ఒడిశాకు చెందిన అభిరామ్‌దాస్‌ అలియాస్‌ అభి 12ఏళ్ల క్రితం భార్యతో కలిసి నగరానికి వలసొచ్చాడు. ఎనిమిదేళ్ల క్రితం భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. మేడ్చల్‌ జిల్లా కీసర మండల పరిధి బండ్లగూడలోని ఓ గదిలో అద్దెకుంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన అభిరామ్‌దాస్‌ కామవాంఛను తీర్చుకునేందుకు చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో దమ్మాయిగూడ వెంకటేశ్వరకాలనీలో ఈ నెల 4న మూడున్నరేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. మరో బాలిక గమనించి చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నిందితుడు చిన్నారిని రాత్రంతా సమీప అటవీ ప్రాంతంలోనే ఉంచి అఘాయిత్యానికి పాల్పడి, ఆపై సమీపంలోని నీళ్ల ట్యాంకు వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించారు.

దొరికాడిలా..

శుక్రవారం రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్న క్రమంలో నిందితుడు మరో బాలికను అపహరించేందుకు యత్నిస్తూ దొరికిపోయాడు. దమ్మాయిగూడ ప్రాంతంలోని కిరాణా దుకాణానికి వచ్చిన నిందితుడు అక్కడే ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లి ప్రతిఘటించడంతో పారిపోయాడు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అటవీ ప్రాంతంలో అరెస్టు చేశారు. నెల క్రితం కీసర ఠాణా పరిధిలోనూ మరో చిన్నారిపై దాడికి పాల్పడిన ఘటనలోనూ ఇతగాణ్ని నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని రాచకొండ కమిషనరేట్‌ ఎదుట భాజపా మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తికి వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details