తెలంగాణ

telangana

ETV Bharat / crime

వంద కోసం వివాదం.. యువకుడి ప్రాణం తీసిన ఘర్షణ - ఏపీ క్రైం న్యూస్

ఆ నలుగురికి పనిచేస్తే రెండువేలు రూపాయలొచ్చాయి. 500ల చొప్పున నలుగురు నాలుగుభాగాలుగా పంచుకోవాలి. కానీ ముగ్గురు సమానంగా తీసుకుని.. ఓ వ్యక్తికి మాత్రం వంద తక్కువచేసి 400 ఇచ్చారు. వంద రూపాయలు ఇవ్వాలని ఆ వ్యక్తి అడుగగా..గొడవ జరిగింది. ఆ ముగ్గురు తర్యాత 100 రూపాయలు ఆ వ్యక్తి ఇచ్చి..ఇకనుంచి పనికి రావొద్దని హెచ్చరించారు. పని విషయంలో ఓ బార్ వద్ద వారికి ఘర్షణ కాగా ముగ్గురు వ్యక్తులు.. ఒక్కసారిగా నాలుగో వ్యక్తిపై పట్టపగలే బ్లేడుతో దాడికి దిగగా..అతను మరణించాడు.

murder, vijayawada crime
వంద కోసం వివాదం

By

Published : Apr 3, 2021, 11:20 AM IST

వంద కోసం వివాదం.. యువకుడి ప్రాణం తీసిన ఘర్షణ

వంద ఓ వ్యక్తి ప్రాణాల్ని తీసింది. నలుగురి వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం.. బ్లేడు దాడులకు దారితీసేలా చేసింది. నలుగురు వ్యక్తులు ఓ సమూహంలో ఒకరిపై మరొకరు బ్లేడ్లతో గాయపరుచుకున్నారు. ముగ్గురు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిని అత్యంత కిరాతకంగా గొంతు భాగం, ముఖంపై గాయపర్చడంతో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్‌ పరిధిలో.. పైపులరోడ్డు-వాంబేకాలనీ మార్గంలోని దుర్గాబార్‌ వద్ద.. నలుగురు వ్యక్తులు బ్లేడ్లతో ఒకరిపై దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాంబేకాలనీకి చెందిన దొడ్డ కిషోర్‌, షేక్‌ రఫీ, బొడ్డుపల్లి నాగరాజు అలియాస్‌ పండు, రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌ నలుగురూ సెంట్రింగ్‌ పనులు చేస్తుంటారు. ఏప్రిల్‌ 1వ తేదీన..గన్నవరంలో పనికి వెళ్లారు. అక్కడ పనులు ముగిసిన తర్వాత మేస్త్రీ 2వేల రూపాయలు ఇవ్వగా ఆ నగదును సమాన భాగంలో పంచుకోకుండా..దొడ్డ కిషోర్, రఫీ, హుస్సేన్‌లు 500 రూపాయలు చొప్పున తీసుకుని, నాగరాజుకు మాత్రం... 100 తగ్గించి 400 రూపాయలు ఇచ్చారు. ఈ విషయమై వాంబేకాలనీ రోడ్డులోని అన్నపూర్ణ బార్‌ వద్ద అదే రోజు రాత్రి గొడవ జరగడంతో నాగరాజుకు 100 రూపాయలు తిరిగి ఇచ్చేసి.. ఇకపై పనిలోకి రావద్దని ముగ్గురు చెప్పారు.

బ్లేడ్‌తో దాడి

శుక్రవారం కిషోర్, రఫీ, హుస్సేన్‌లు కలిసి దుర్గాబార్‌లో మద్యం సేవించి .. నాగరాజుకు ఫోన్‌ చేయగా ఉదయం 10 గంటల ప్రాంతంలో బార్‌ వద్దకు ద్విచక్రవాహనంపై వచ్చాడు. బార్‌ పక్కన వీధిలోకి వెళ్లిన నలుగురు మద్యం మత్తులో ఉండి.. పనిలోకి రావద్దని చెప్పిన విషయమై గొడవపడ్డారు. నలుగురు మధ్య మాటా మాటా పెరిగిపోవడంతో... కిషోర్, రఫీ, హుస్సేన్‌లు కలిసి బ్లేడ్‌తో నాగరాజుపై దాడి చేశారు. ఇదే సమయంలో..పెనుగులాటలో మిగిలిన ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 100కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నలుగురిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగరాజు చనిపోయాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. అవివాహితుడైన నాగరాజు వాంబే కాలనీ ఎఫ్‌ బ్లాక్‌లో నివాసముంటున్నాడు. ఘటనా స్థలంలో రక్తపు మడుగు చూసి స్థానికులు సైతం హడలిపోయారు. నార్త్‌జోన్‌ ఇన్‌ఛార్జి ఏసీపీ ఎం.రమేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

హుస్సేన్‌పై రౌడీషీటు

ఈ హత్య ఘటనలో నిందితుడైన పాత రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌పై నున్న గ్రామీణ పోలీసుస్టేషన్‌లో రౌడీషీటు ఉంది. గతంలో అతడు 5 కేసుల్లో ముద్దాయిగా ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనూ పోలీసులు బైండోవర్‌ చేశారు. పాత నేరస్థుడి కదలికలపై పోలీసుల నిఘా లేక పోవడంతోనే ఈ ఘటన జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం రాత్రి అన్నపూర్ణ బార్‌ వద్ద జరిగిన ఘర్షణ సమయంలోనూ పోలీసులు వచ్చి సర్దిచెప్పి పంపేశారని, అప్పుడే నలుగుర్నీ అదుపులోకి తీసుకొని ఉంటే ఈ ఘటన చోటు చేసుకునేది కాదని పలువురు అంటున్నారు. ఇదిలా ఉండగా మృతుడు నాగరాజుతో పాటు మిగిలిన ముగ్గురి శరీరాలపై బ్లేడ్లతో కోసుకున్న ఆనవాళ్లు ఉండడంతో నలుగురూ బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన వారని, గంజాయి అలవాటు సైతం ఉందని తెలుస్తోంది.

అన్ని కోణాల్లో విచారిస్తున్నాం

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు. హుస్సేన్‌కు గత నేరచరిత్ర ఉండగా, చనిపోయిన నాగరాజు సైతం పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని ఏడీసీపీ లక్ష్మీపతి పేర్కొన్నారు. హత్య ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని.. మద్యం మత్తులో జరిగిన దాడిలో నాగరాజు చనిపోయాడన్నారు. నలుగురూ బ్లేడ్‌లతో దాడి చేసుకున్న మాట వాస్తవమే అయినా బ్లేడ్‌బ్యాచ్‌కు చెందిన వారని నిర్ధారించలేమని చెప్పారు. బైండోవర్‌ అయిన హుస్సేన్‌ ఈ ఘటనలో ఉండడంపై వివరాలు తీసుకోవాల్సి ఉందని, మరిన్ని వివరాలు విచారణలో తేలాల్సి ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details