మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఐఐ జంక్షన్ దగ్గర ద్విచక్రవాహనాన్ని.. కారు ఢీకొట్టిన ఘటనలో నిందితుడు సృజన్‌కుమార్‌ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సృజన్ కుమార్ మద్యం సేవించాడా..? లేదా..? అనేది నిర్ధారించేందుకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టగా వెనుక కూర్చున్న జెన్నిఫర్ అక్కడికక్కడే మృతి చెందారు. బైకు నడుపుతున్న అజయ్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. నిందితుడు సృజన్ కుమార్ కారు వదిలేసి పారిపోయాడు. అతని వాహనానికి 11కు పైగా చలాన్‌లు ఉన్నాయి. ఈ చలాన్లన్నీ డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌లకు చెందినవని పోలీసులు గుర్తించారు.
శనివారం రాత్రి కొండాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో సృజన్ కుమార్ పార్టీ చేసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్టీ తర్వాత సృజన్ ఇంటికి రాలేదు.. మరుసటి రోజు ఆదివారం ఉదయం ఇంటికి కారులో బయల్దేరాడు. సీఐఐ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని అతివేగంగా ఢీకొట్టి ప్రమాదానికి కారకుడయ్యాడు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా సృజన్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.