దేశంలోని పలు రాష్ట్రాల్లో సంపన్నులు కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కార్లను.. కొన్ని నెలలు వాడిన తర్వాత సగం ధరకే వాటిని అమ్మేస్తుంటారు. ఈ విషయం తెలిసిన హైదరాబాద్‌లోని కొందరు వ్యక్తులు... వాటిని కొనుగోలు చేసి.. కొన్ని నెలల వినియోగం తర్వాత అమ్మేస్తున్నారు. కానీ.. ఇక్కడే ఓ తిరకాసు ఉంది.
లగ్జరీ కార్లు కొని అమ్మేసే వీరు.. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల పన్నును ఎగ్గొడుతున్నారు. కొన్ని నెలలుగా దీనిపై రవాణాశాఖకు పలు ఫిర్యాదులు వచ్చాయి. సాధారణంగా కొత్తకారు కొనుగోలు చేసినప్పుడు దాని ఇన్వాయిస్పై 14 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. కోట్ల రూపాయల విలువైన కార్లను కొనుగోలు చేసినప్పుడు... వాటిపై కనీసం 8 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఏళ్లు గడిచిన కొద్దీ ట్యాక్స్‌ను తగ్గిస్తుంటారు.
ఒక్కో కారుపై రూ.20లక్షల పైనే!
ఒక్కో కారుపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. వాటిని కొన్నవారు మాత్రం పన్ను చెల్లించరు. గుట్టుగా ఏ ఫంక్షన్లకో... రేసింగ్లకో తీసుకెళ్తూ.. రాత్రిళ్లు వాడుతుంటారు. ఒకవేళ దొరికినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అలా పన్ను కట్టని ఫెర్రారీ, బెంజ్ వంటి సుమారు 11 ఖరీదైన స్పోర్ట్స్ కార్లపై రవాణాశాఖ అధికారులు నిఘాపెట్టారు. పక్క ప్రణాళికతో వాళ్లను పట్టుకున్నారు.