Sexual Harassment Case: మహిళలు, యువతులపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట ఏదో విధంగా మహిళలు మోసపోతూనే ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై రాజేంద్రప్రసాద్ అనే యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పెద్దపల్లి జిల్లా అందుగుల పల్లికి చెందిన యువతి గత మూడేళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. నాలుగేళ్ల క్రితం తన అక్క వివాహంలో.. కరీంనగర్ జిల్లాలోని గద్దె పక్క గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్‌తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్.. బాధితురాలిని వివాహ చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆమెను ఫోటోలు, వీడియోలు తీశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకోవాలని అడిగినప్పుడు.. నిందితుడు మాట దాటవేస్తూ వచ్చాడని... కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోనని చెప్పినట్లు వెల్లడించింది. ఒకవేళ ఆమె ఇతరులను ఎవరినైనా వివాహం చేసుకుంటే తన వద్ద ఉన్న ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. విసిగిపోయిన బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.