ఆన్‌లైన్ లావాదేవీలను సైబర్ మాయగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కొనుగోలుదారులకు బహుమతుల ఆశచూపి అందినంత సొమ్ము కాజేస్తున్నారు. చాలా తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వీరి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. వంద రూపాయలతో కొనుగోలు చేసిన వస్తువులకు లక్షలు విలువైన బహుమతులు ఎలా వస్తాయంటూ విచక్షణతో ఆలోచించాలంటున్నారు. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ తరహా కేసులు 20కి పైగా నమోదయ్యాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేస్తున్న వారి వివరాలు బయటి వ్యక్తుల చేతికి చేరటమే మోసాలు పెరిగేందుకు కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు.
చెప్పులు కొన్నందుకు 20 లక్షల కారు.. ఎల్బీనగర్‌కు చెందిన గృహిణి ఇటీవల కొత్తగా వచ్చిన ఓ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా పాదరక్షలు కొనుగోలు చేశారు. మూడ్రోజులకు డెలివరీ బాయ్ వాటిని ఇంటి వద్దకే తెచ్చిచ్చాడు. అదే రోజు సాయంత్రం.. పాదరక్షల కంపెనీ కస్టమర్ కేర్ నుంచి అంటూ ఆమెకు ఫోన్‌కాల్ వచ్చింది. నెల రోజుల్లో తమ కంపెనీ నుంచి వస్తువులు కొనుగోలు చేసిన వారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామని.. వాటితో ఆమె పేరు ఉందంటూ టెలీకాలర్ వివరించాడు. రూ.20లక్షల విలువైన కారు గెలుచుకున్నారంటూ ఆశ చూపాడు. పన్నుల రూపంలో కొద్దిమొత్తంలో చెల్లించాల్సి ఉంటుందంటూ దఫాల వారీగా రూ.లక్షన్నర తమ ఖాతాల్లో జమచేసుకున్నారు. విదేశీ కారు కావటంతో కస్టమ్స్ పన్నులు పడతాయంటూ రూ.3.5లక్షలు డిమాండ్ చేయటంతో బాధితురాలికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇదంతా సైబర్ నేరగాళ్ల మోసంగా గుర్తించారు.
డ్రెస్ కొంటే.. లాక్కీ డ్రాలో స్కూటీ గిఫ్ట్.. మరో కేసులో ఉప్పల్‌కు చెందిన ఓ విద్యార్థిని... తమ కళాశాలలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో దుస్తులు కొనుగోలు చేశారు. పదిరోజుల తరువాత విద్యార్థిని మొబైల్ నెంబర్‌కు ఈ-కామర్స్ వెబ్‌సైట్ నిర్వాహకులమంటూ ఫోన్‌కాల్ వచ్చింది. యూత్ విభాగంలో స్కూటీ గెలుచుకున్నారంటూ ఊరించారు. రవాణా ఛార్జీలు, రిజిస్ట్రేషన్ , పన్నులు వెంటనే చెల్లిస్తే సరిపోతుందంటూ రూ.20,000 కాజేశారు. రోజులు గడుస్తున్నా... ద్విచక్రవాహనం రాకపోవటంతో బాధితురాలు ఈ-కామర్స్ వెబ్‌సైట్ కస్టమర్ కేర్ నెంబర్‌కు ఫోన్ చేయటంతో అసలు విషయం బయటపడింది.