హైదరాబాద్‌లో ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై షాబాద్ మండలం హైతబాద్‌కు చెందిన చరణ్‌తేజ్ పలు ఆరోపణలు చేయటం సోషల్‌మీడియాలో చర్చనీయాంశమైంది. కానిస్టేబుల్ సంధ్యారాణి తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని చరణ్ తేజ్... ఓ సెల్పీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా... వైరల్ అవుతోంది.
పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ 'పెళ్లి' పంచాయితీ
ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ కుటుంబ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. భర్త సెల్పీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... భార్యాభర్తల పంచాయితీపై దృష్టిపెట్టారు.
సంధ్యారాణితో ఇప్పటికే వివాహమై ఎనిమిదేళ్ల కూతురుందని... ఈ విషయాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకుందని వీడియోలో తెలిపాడు. వివాహానంతరం ఈ నిజాలు ఒక్కొక్కటిగా తెలిసాయని... ఏంటని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించాడు. ఉద్యోగం చేయకుండా... తన వాళ్లను కలవనీయకుండా... కనీసం బయటకు కూడా రాకుండా హింసిస్తోందని ఆరోపించాడు. తాను చెప్పినట్టు చేయకపోతే... ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరిస్తోందన్నాడు. కానిస్టేబుల్ నుంచి తనను రక్షించాలంటూ.. శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్స్టేషన్లకు సోషల్‌మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. సంధ్యారాణి బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని చరణ్‌తేజ్ సూచించాడు.
ఇద్దరి అంగీకారంతోనే పెళ్లి...
మరోవైపు.. తాను మోసం చేసి పెళ్లి చేసుకోలేదని సంధ్యారాణి చెబుతోంది. తనకు ఇంతకుముందు జరిగిన పెళ్లి గురించి చెప్పానని... ఇద్దరి అంగీకారంతోనే వివాహం చేసుకున్నామని వివరించింది. ఆర్యసమాజ్‌లో ఇద్దరి సమ్మతంతో చేసుకున్న పెళ్లికి సంబంధించిన ఆధారాలను సంధ్యారాణి బయటపెట్టింది. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు... ఇద్దరిని స్టేషన్ పిలిపించి మాట్లాడారు. కౌన్సిలింగ్ ఇస్తున్నారు.