Lady Advocate Suicide: చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. మేనమామే అన్నీ తానై చూసుకున్నాడు. ఆమెకు నచ్చిన కోర్సును చదివించాడు. ఫలితంగా తాను కూడా కష్టపడి చదివి.. న్యాయవాది వృత్తిలో స్థిరపడింది. ఆ తర్వాత తనకు నచ్చినవాడినిచ్చి పెళ్లి చేశారు. అనంతరం మహిళా న్యాయవాది జీవితం సాఫీగా సాగిపోతోంది. ఐదేళ్ల తమ బంధానికి గుర్తుగా రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇంతలోనే ఆమెపై విధి చిన్నచూపు చూసిందేమో.. ముచ్చటైన వారి కాపురంలో చిచ్చులు రేగాయి. అవి చివరికి ఆమె ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కుమారుడి పుట్టినరోజే ఆమెకు చివరిరోజైంది.
ఇద్దరి వేధింపులు:భర్త, మేనమామ వేధింపులు భరించలేక.. ఓ యువ మహిళా న్యాయవాది బలవర్మణానికి పాల్పడింది. తండ్రి చనిపోతే తనను చదివించి న్యాయవాదిని చేశానని... దీంతో అప్పులపాలయ్యానని.. అవి తీర్చాలని మేనమామ వేధింపులు ఓ వైపు ఎక్కువయ్యాయి. మరో వైపు "నీ సంపాదన మేనమామకెందుకిస్తావ"ని భర్త హూంకరింపు. ఇలా ఇద్దరి మధ్యన నలిగిన బాధితురాలు తనువు చాలించింది. ప్రేమ వివాహం చేసుకున్న మహిళా న్యాయవాది అల్లారుముద్దుగా చూసుకుంటున్న రెండేళ్ల కుమారుడి పుట్టిన రోజే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చందానగర్ లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ డిఫెన్స్ కాలనీలో నివాసముంటున్న మహిళా న్యాయవాది శివాని.. ఐదేళ్ల కిందట కడపకు చెందిన అర్జున్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఈ రోజే కుమారుడి రెండో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సి ఉంది. అయితే శివానీ చిన్నతనంలోనే ఆమె తండ్రి బీహెచ్ఈఎల్లో పనిచేస్తూ చనిపోయాడు. అప్పటి నుంచి ఈమె మేనమామ రఘు.. శివాని బాధ్యతలు తీసుకున్నాడు. శివాని బాగా చదువుకుని న్యాయవాది వృత్తిని చేపట్టింది.