Police Caught thief by owner complaint from America: ఇంట్లో చోరీకి వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీసులు ప్రత్యక్షంగా పట్టుకున్నారు. కేపీహెచ్‌బీ రెండో రోడ్డులోని ఎల్‌ఐజీ 237 ప్లాట్ యజమాని తాళం వేసి గతేడాది డిసెంబర్‌లో అమెరికా వెళ్లారు. ఇంటికి సీసీ కెమెరాల వ్యవస్థ ఉంది. ఇంటి యజమాని అమెరికా నుంచి భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీటీవీ ఫుటేజీలు తనిఖీ చేస్తుండగా తమ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి దూరి గదుల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆయన వెంటనే అప్రమత్తమై ఇరుగుపొరుగు వారికి సమాచారమిచ్చారు. వారు వెళ్లి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపల గడియ పెట్టి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి విధుల్లో ఉన్న డీఎస్సై శ్యాంబాబు, కానిస్టేబుళ్లు అశోక్, సురేశ్ 5 నిమిషాల్లో చేరుకున్నారు. తలుపులు తీయాలని దొంగను హెచ్చరించారు. తియ్యకపోవడంతో డీఎస్సై తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్లేసరికి దొంగ మొదటి పడక గది తలుపు వెనక నక్కాడు. వెంటనే డీఎస్సై తుపాకీతో హెచ్చరించడంతో లొంగిపోయాడు.
చోరీకి యత్నించిన తిప్పరాజు రామకృష్ణ బూట్లలో పెట్టి
గదుల్లో బీరువా, షెల్ఫ్‌లు తెరిచినట్లు గుర్తించారు. చోరీ చేసిన నగదు, వెండి ఆభరణాలను బూట్లల్లో దాచి చాకును సోఫా కింద పడేసి పలు ఆభరణాలు మంచం పరుపు కింద దాచినట్లు కనుగొన్నారు. అతన్ని నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపర్లకు చెందిన తిప్పరాజు రామకృష్ణ(32)గా గుర్తించారు. ఇతను జూబ్లీహిల్స్‌లో ఒంటరిగా ఉంటూ సినీ పరిశ్రమలో బాయ్‌గా పనిచేస్తుంటాడు. ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీ చేసి 10 సార్లు జైలుకి వెళ్లొచ్చినట్లు గుర్తించారు. ఇటీవల ఓ కేసుకు సంబంధించి జైలు నుంచి విడుదలయ్యాడు. నిందితుడి నుంచి నగదు, వెండి ఆభరణాలు, చేతి గడియారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్సై శ్యాంబాబు.. గతనెల 4న రాత్రి విధుల్లో ఉన్నప్పుడు కూకట్‌పల్లికి చెందిన ఓ యువజంట ఆత్మహత్య చేసుకోబోతుండగా కాపాడిన విషయం విదితమే. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు వారి బంధువులిచ్చిన సమాచారంతో సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా ఆ జంట మియాపూర్‌లోని ఓ లాడ్జిలో ఉన్నట్లు తెలుసుకుని సకాలంలో వెళ్లి జంటను కాపాడి ఆసుపత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి:శ్రుతిమించిన రుణయాప్‌ల ఆగడాలు.. మహిళ ఫోన్ నంబర్‌ను 500 మందికిచ్చి వేధింపులు