ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథిని సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు... మొదటి రోజు ఆయన వ్యాపార లావాదేవీల గురించి ప్రశ్నించారు. పెట్టుబడిదారుల షేర్లను బ్యాంకుల్లో ఏ విధంగా తనఖా పెట్టారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఎక్కడికి మళ్లించారనే విషయాలను పార్థసారథిని ప్రశ్నించారు.
బ్యాంకులను మోసం చేసిన కేసులో కార్వీ ప్రమోటర్ల పాత్ర ఏ మేరకు ఉందనే విషయాన్ని సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. పార్థసారథి నిధులను పక్కదారి పట్టించినందుకు సీసీఎస్ పోలీసులు... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని సొంత ఖాతాకు మళ్లించి... అక్కడి నుంచి పలు సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లు తేల్చిన సీసీఎస్ పోలీసులు.. మనీ ల్యాండరింగ్ జరిగినందుకు దర్యాప్తు చేపట్టాలని ఈడీని కోరారు.