ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్ పోలీసులు నవాగరా సర్వీస్ రోడ్డులో పట్టుకున్న ఇద్దరు నైజీరియన్లు హారిసన్, జాన్‌నాన్సో మత్తుదందా కేసులో డొంక కదులుతోంది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణకు విస్తరించింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇంకొందరు ప్రముఖులకూ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మత్తుమందుల కేసులో హైదరాబాద్ లింకులకు కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి అలియాస్ రతన్ కీలకంగా మారారు. వారిని విచారిస్తే అందరి బండారం బయటపడుతుందని భావించిన కర్ణాటక పోలీసులు ఇప్పటికే వారిద్దరికీ నోటీసులు జారీ చేశారు. మార్చి 30న గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని పేర్కొన్న హాజరుకాలేదు. దీంతో వీరిపై చట్టపరమైన చర్యలకు కర్ణాటక పోలీసులు సిద్ధమవుతున్నారు.
మత్తుమందుల కేసు దర్యాప్తులో భాగంగా కన్నడ సినీనిర్మాత శంకరగౌడను విచారించగా... రతన్‌రెడ్డి అలియాస్ రతన్‌పేరు వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో జరిగే పార్టీల్లో తనను తాను ఉద్యమకారుడిగా చెప్పుకునేవాడని, దాంతో బెంగళూరు పోలీసులు తమ రికార్డుల్లో కూడా ఉద్యమకారుడు రతన్ రెడ్డిగానే పేర్కొన్నట్లు తెలుస్తోంది. శంకర్ గౌడ కుమార్తె పుట్టినరోజు పార్టీలో హైదరాబాద్ వ్యాపారి సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యేతోపాటు శ్రీనురెడ్డి అనే మరో వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అయితే వీరిలో శ్రీను రెడ్డి గురించిన పూర్తి వివరాలు బెంగళూరు పోలీసులు సేకరించలేకపోయారు. ఓ కన్నడ నటుడికి చెందిన హోటల్ లో జరిగే పార్టీలకు కలహర్ రెడ్డి, రతన్‌లు హైదరాబాద్ నుంచి రాజకీయ, సినీప్రముఖులను తీసుకొచ్చేవారని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటికే విచారణకు హాజరైన టాలీవుడ్ హీరో..
ఈ కేసులో మరో కీలక సూత్రధారి మస్తాన్‌చంద్ర పోలీసులకు అప్రూవర్‌గా మారేందుకు ఒప్పుకున్నాడు. ఇప్పటికే పలువురి పేర్లను తెలిపినట్లు సమాచారం. ఈ జాబితా ఆధారంగానే పార్టీలకు హాజరైన ప్రముఖుల సంఖ్య ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. ఇందులో హైదరాబాదకు చెందిన సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన మస్తాన్ చంద్రను మార్చి 6న ఇదే మత్తుమందుల కేసులో అరెస్టు చేశారు. హైదరాబాద్ బృందం పాల్గొనే దాదాపు ప్రతి పార్టీలోనూ మస్తాన్‌చంద్ర ఉండేవాడు. ఇలాంటి పార్టీలకు అతను మత్తుమందులు సరఫరా చేసేవాడనేది ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ సినీ పరిశ్రమకు చెందిన ఓ హీరోను ఇప్పటికే విచారించగా ఇంకా అనేక మంది పేర్లు పోలీసులు గుర్తించారు. వీరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.