మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి, కుమారుడు పద్మ, సంతోష్ ఆత్మాహుతి ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ నేతల వేధింపులు, పోలీసుల ఉదాసీన వైఖరి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ మరణానికి వీరే కారణమంటూ ఏడుగురి పేర్లను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సంతోష్.. తన తల్లితో కలిసి శనివారం కామారెడ్డిలోని ఓ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగాలపై పోలీసులు అదే రోజు ఆ ఏడుగురిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎ1గా పల్లె జితేందర్‌గౌడ్, ఎ2 యాదగిరి, ఎ3 ఐరేనీ పృథ్వీగౌడ్, ఎ4 తోట కిరణ్, ఎ5 కన్నాపురం కృష్ణాగౌడ్, ఎ6 స్వరాజ్, ఎ7గా తాండూరి నాగార్జునగౌడ్‌ను చేర్చారు. ఈ కేసు విచారణాధికారి బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి ఆదివారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. లాడ్జిలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. మృతుల కాల్‌డేటా, మరణ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారాయి. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేశారు.
బాధ్యులను శిక్షించాలి: తెదేపా
రామాయంపేటకు చెందిన తల్లి, కుమారుడి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు డిమాండ్ చేశారు. కామారెడ్డిలో బలవన్మరణాలకు పాల్పడిన పద్మ, సంతోష్ కుటుంబసభ్యులను రామాయంపేటలో ఆదివారం ఆయన పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
జితేందర్‌గౌడ్ రిజిస్ట్రేషన్లను అడ్డుకున్నాడు.. -మృతుడు సంతోష్ సోదరులు
రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్‌గౌడ్ వేధింపులను భరించలేకనే స్థిరాస్తి వ్యాపారం చేసే మా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని సంతోష్ సోదరులు శ్రీధర్, శ్రీనివాస్ ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు. ‘‘సంతోష్‌ను జితేందర్‌గౌడ్ ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. ఇతరులకు విక్రయించిన భూములు రిజిస్ట్రేషన్లు కాకుండా అడ్డుకునే వారు. ఆ ఏడుగురిని కఠినంగా శిక్షించాలి’’ అని సంతోష్ రెండో అన్న శ్రీధర్ చెప్పారు. ‘‘జితేందర్‌గౌడ్ మమ్మల్ని ఎంతో కష్టపెట్టాడు. రామాయంపేటలో మా మామ నాగభూషణం, మరో భాగస్వామి రాధాకిషన్ భార్య పేరుపై ఓ రైస్‌మిల్లు ఉంది. ఏడాది క్రితం మా మామ పేరును అధికారులు రికార్డుల నుంచి తొలగించారు. పురపాలిక అధికారులను కలిస్తే.. ఛైర్మన్ సూచనతోనే పేరు మార్చామని అన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం అంటే తిరిగి దస్త్రాల్లో మా మామ పేరు చేర్చారు’’ అని సంతోష్ పెద్దన్న శ్రీనివాస్ వివరించారు.
బాధ్యులమని తేలితే దేనికైనా సిద్ధం: జితేందర్‌గౌడ్, యాదగిరి
గంగం సంతోష్, ఆయన తల్లి పద్మ ఆత్మహత్యకు తామే బాధ్యులమని తేలితే తాము ఏ శిక్షకైనా సిద్ధమే అని జితేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి తెలిపారు. తల్లి, కుమారుడి ఆత్మహత్య ఘటనపై జితేందర్‌గౌడ్, యాదగిరి ఆదివారం సెల్‌ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. ముందుగా జితేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘‘నేను వారిని ఏ రకంగానూ బాధ పెట్టలేదు. వారి విషయంలో తప్పుచేసినట్లు తేలితే మెదక్ చౌరస్తాలో ఆత్మబలిదానం చేసుకుంటా. తప్పులు నిరూపిస్తే పుర ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తా’’ అని వివరించారు.