Gajularamaram student suicide case: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నగరంలోని జీడిమెట్ల ఇంటర్ విద్యార్థి అదృశ్యం విషాదాంతమైంది. గాజులరామారం చింతల్ చెరువులో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 22న షాపూర్‌నగర్‌కు చెందిన సుమిత్‌కుమార్(17) అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు ఇష్టంలేని కోర్సులో చేర్పించారని మనస్తాపానికి గురైన సుమిత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చింతల్ చెరువు వద్ద ఉన్న విద్యార్థి చెప్పులు ఆధారంగా మంగళవారం గాలింపు చేపట్టిన పోలీసులు.. ఇవాళ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు.
ఏం జరిగింది?
inter student suicide in telangana 2021: షాపూర్‌నగర్‌లో నివాసముంటున్న రమేశ్‌కుమార్ ప్రైవేటు ఉద్యోగి. అతని కుమారుడు సుమిత్‌కుమార్(17) చింతల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్‌లో అతనికి ఇష్టం లేకపోయినా.. తల్లిదండ్రులు ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలని బలవంతం చేశారని ఇన్‌స్పెక్టర్ కె.బాలరాజు తెలిపారు. ఆ గ్రూపులోనే తొలి ఏడాది చదువు పూర్తి చేశాడు.
కౌన్సిలింగ్ ఇచ్చినా నో యూజ్..
ఇష్టం లేని కోర్సులో చేర్పించారని మనస్తాపం చెందగా... పలుసార్లు తండ్రి, అక్క, కాలేజ్ సిబ్బంది సుమిత్ కుమార్‌కు కౌన్సిలింగ్ ఇచ్చనప్పటికీ ఎలాంటి మార్పు లేదని స్థానికులు చెబుతున్నారు. చేసేదిలేక రెండో ఏడాది కళాశాలకు వెళ్లనని చెప్పడంతో ఎంపీసీ నుంచి సీఈసీకి బదిలీ చేయించారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఫోన్ వదిలేసి వెళ్లిపోయాడు(inter students suicide). బంధువులు, స్నేహితుల వద్ద కుటుంబసభ్యులు విచారించినా ఫలితం కన్పించలేదు. అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముమ్మర గాలింపు..
విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఇన్‌స్పెక్టర్ కె.బాలరాజు వెల్లడించారు. షాపూర్‌నగర్ నుంచి గాజులరామారం.. అక్కడి నుంచి గాజులరామారం చింతల్ చెరువు వైపు వెళ్తున్నట్లు దృశ్యాలు కన్పించాయి. చెరువువద్ద విద్యార్థి చెప్పులు దొరికాయి. దీంతో బల్దియా అధికారులకు సమాచారమిచ్చిన పోలీసులు... ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. మళ్లీ ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టి విద్యార్థి మృతదేహాన్ని చెరువులో గుర్తించారు.
ఇదీ చదవండి:Fb Cheating: అమ్మాయి పేరుతో చాటింగ్... కోటి కొల్లగొట్టిన కిలాడి దంపతులు