foreign drugs: మత్తు పదార్థాలకు రాష్ట్రంలో చోటుండకూడదన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసు, ఆబ్కారీశాఖలు స్థానికంగా ఉత్పత్తి, రవాణా, వినియోగంపైనే దృష్టి సారిస్తున్నాయి. గంజాయి సాగయ్యే ప్రాంతంలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను తనిఖీ చేయడం వంటి వాటి ద్వారా చాలా వరకూ గంజాయిని పట్టుకోగలుగుతున్నారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల మూతపడ్డ ఔషధ కంపెనీలన్నింటిపైనా పోలీసులు కన్నేశారు. తద్వారా రసాయన మత్తుమందుల ఉత్పత్తి అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు. కానీ విదేశాల నుంచి దిగుమతి అవుతున్న మాదకద్రవ్యాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.
గత కొంతకాలంగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు భారీ స్థాయిలో మత్తుమందులు దిగుమతి అవుతున్నాయని అధికారులు గుర్తించారు. గత ఏడాది కేవలం నెల రోజుల వ్యవధిలోనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రూ.వంద కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న మత్తుమందులకు సంబంధించిన సమాచారం కస్టమ్స్, డీఆర్‌ఐ, ఎన్సీబీ సంస్థలకు మాత్రమే ఉంటుంది. కేవలం మత్తుమందుల నియంత్రణ విధులు నిర్వర్తించే ఎన్సీబీకి హైదరాబాద్‌లో కేవలం ఇద్దరు మాత్రమే అధికారులు ఉన్నారంటే ఈ సంస్థ పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ మూడు సంస్థలు కూడా వివిధ అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి సమాచారం అందినప్పుడు మాత్రమే అనుమానితులను తనిఖీ చేస్తున్నాయి.