తెలంగాణ

telangana

ETV Bharat / crime

fake currency : నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. వారి పథకం ఏమిటి..? ఎలా దొరికిపోయారు? - హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ వార్తలు

హైదరాబాద్​లో నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నోట్లు ముద్రిస్తున్న ఐదుగురిని పశ్చిమ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో నకిలీ నోట్లు, ప్రింటింగ్​ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

cp anjani kumar
cp anjani kumar

By

Published : Aug 19, 2021, 5:15 PM IST

Updated : Aug 19, 2021, 7:00 PM IST

హైదరాబాద్‌లో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ముఠాలోని ఐదుగురిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 16 లక్షల విలువైన నకిలీ నోట్లు, ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఫోటోగ్రఫీ నేర్చుకుని అందులో పట్టు సాధించి... సొంతంగా ల్యాబ్​ పెట్టుకోడానికి డబ్బు కూడబెట్టాలని ఒకరు. ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోడానికి ఎలాగైన డబ్బు సంపాధించాలని ఇంకొకరు.. బీఎస్​ఎఫ్​లో ఉద్యోగం కోల్పోయి ఇంట్లో చిన్న చిన్న సమస్యల వల్ల ఎలాగైన ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మరొకరు.. చదువుకునే రోజుల్లోనే డబ్బుపట్ల ఆకర్షితులై సొమ్ము కూడబెట్టుకోవాలని మరో ఇద్దరు.. ఈ ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి ఎంచుకున్న మార్గం నకిలీ నోట్లు ముద్రణ. సిద్దిపేట అడ్డాగా నకిలీ నోట్లు ముద్రణకు తెరలేపిన ఈ గ్యాంగ్​.. హైదరాబాద్​లో నోట్లు చలామణి చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

సిద్దిపేటలో భరత్​నగర్​కు చెందిన సంతోష్​కుమార్​ ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. సొంతంగా ల్యాబ్​ పెట్టుకోడానికి ఆర్థికస్థితి సరిపోకపోవడం వల్ల డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించే క్రమంలో కొరియర్​గా పనిచేస్తున్న జానకి సాయికుమార్​ కలిశాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న సాయికుమార్​, సంతోష్​తో కలిసి డబ్బు సంపాదించేందుకు నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి.. చలామణి చేసేందుకు పథకం వేశారు. వారికి కావాల్సిన టెక్నికల్​ సహాయాన్ని విద్యార్థులైన జలగం రాజు, నీరజ్​ కుమార్​ అందించారు. ఇంతవరకు బాగానే నడిచింది. తయారీ చేసిన నోట్లను చలామణి చేయడం అనే సమస్య వచ్చింది. అప్పుడు వీరితో చేతులు కలిపాడు బీఎస్​ఎఫ్​ ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉంటున్న శ్రీనివాస్​. నకిలీ నోట్లను 10 శాతం కమిషన్​ తీసుకుని మారుస్తానని చెప్పాడు. అన్ని వసతులు సమకూర్చుకున్న ముఠా ముద్రణ రంగంలోకి దిగింది. మొదటగా రెండు రూ.500 నోట్లను తయారు చేసి.. ఒకటి వైన్​షాపు దగ్గర, రెండోది కూరగాయల మార్కెట్లో చలామణి చేశారు. వాటిని ఎవ్వరూ గుర్తుపట్టకపోవడంతో ఇక పూర్తిగా రంగంలోకి దిగిపోయారు.

ఇలా దొరికిపోయారు...

పెద్దసంఖ్యలో నోట్లు ముద్రించి 1:3 నిష్పత్తిలో నకిలీ నోట్లు ఇచ్చి ఒరిజినల్​ నోట్లు మార్పిడి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుని వాటిని జూబ్లీహిల్స్​లో డెలివరీ ఇవ్వడానికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 16 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, ముద్రణకు ఉపయోగించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఈ నకిలీ నోట్లను గుర్తించడం ఎలా?

ఒరిజినల్​ నోటును ముట్టుకున్నప్పుడు గరుకుగా చేతికి తెలుస్తుంది. నకిలీ నోటు కేవలం ప్రింట్​ మాత్రమే ఉంటుంది. నోటుకు ఎడమవైపున ఉన్న ఐదు లైన్లను ముట్టుకున్నప్పుడు ఒరిజినల్​ నోటును గుర్తించవచ్చు. భారత కరెన్సీనోటుకు ఒక సెక్యురిటీ లైన్​ ఉంటుంది. అది నీలం, ఎరుపు రంగుల మిళితమై ఉంటుంది. అది కొన్ని కోణాల్లో మార్చి చూస్తే కనిపిస్తుంది. నకిలీ నోటులో ఒకే రంగు ఉంటుంది. అదికూడా గిఫ్ట్​ ప్యాక్​లకు ఉపయోగించే కాగితాన్ని చిన్నగా కత్తిరించి అతికించారు. కాగితం నాణ్యత కూడా తేడా తెలుస్తుంది. నకిలీ నోటు తయారీలో రెండు వైపులా ముద్రించి వాటిని ఫెవికల్​తో అతికిస్తారు. నకిలీ నోటు చాలా రఫ్​గా ఉంటుంది. సాధారణంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో సాధారణ ప్రజలు ఇవన్నీ గుర్తించలేక పోవచ్చు. దీనినే ఆసరాగా చేసుకుని నకిలీనోట్ల చలామణికి పాల్పడుతున్నారు. అంజనీ కుమార్​, హైదరాబాద్​ సీపీ

ఈ కేసులో చుక్కాపురం సంతోష్‌కుమార్‌, జానకి సాయికుమార్‌, ధర్మాజీ నీరజ్‌ కుమార్‌ అలియాస్‌ పింటూ, జాలిగం రాజు, సుంకరి శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశామని సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

హైదరాబాద్‌లో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

ఇదీ చూడండి:రంగురాళ్ల చోరీ కేసులో ట్విస్ట్​ .. 17.72 కోట్ల నకిలీ నోట్లు లభ్యం

Last Updated : Aug 19, 2021, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details