నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు సమీపంలో రెండు చుక్కల దుప్పులను చంపిన ముగ్గురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు సమీపంలోని హన్మాపూర్ తండాకు చెందిన ఏడుగురు వేటగాళ్లు.. కృష్ణా నదిని దాటి మద్దిమడుగు అటవీ పరిధిలోకి ప్రవేశించారు. తమ దగ్గర ఉన్న ఆయుధాలతో రెండు చుక్కల దుప్పులను వేటాడి చంపారు.
అటవీ ప్రాంతంలో దుప్పులపై దాడి.. నిందితులు అరెస్ట్ - అటవీ ప్రాంతాల్లో దుప్పులపై దాడి
నాగర్ కర్నూల్ జిల్లా అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణులపై దాడులు చేస్తున్నారు. రెండు చుక్కల దుప్పులను చంపిన వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. చనిపోయిన వాటికి పంచనామా నిర్వహించారు.
నాగార్జునసాగర్ అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మద్దిమడుగు అటవీ అధికారులు.. దుప్పుల చర్మం తీస్తున్న ముగ్గురు వేటగాళ్లను పట్టుకున్నారు. ఆ సమయంలో మిగిలిన నలుగురు పారిపోయారు. నిందితుల నుంచి బాణాలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దుప్పులకు పంచనామా నిర్వహించి ఖననం చేశారు. వేటగాళ్లకు కృష్ణా తీరంలోని మత్స్యకారులు సహకరిస్తున్నారని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మద్దిమడుగు రేంజ్ అధికారి ఆదిత్య తెలిపారు.
ఇదీ చదవండి:'ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే "నిండుచూలాలు" మృతి'