Human trafficking in Telangana: రాష్ట్రంలో మానవ అక్రమరవాణా ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. సగటున రోజుకు ఇద్దరు చొప్పున బాధితులు అక్రమ రవాణా ముఠాల బారిన పడుతున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా కేసులు రెండున్నర రెట్లకుపైగా పెరిగాయి. 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేరగణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ తరహా కేసుల నమోదులో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం మహారాష్ట్రది. అయితే తమకు చిక్కిన ప్రతి వ్యభిచారం ఉదంతంలోనూ లైంగిక అక్రమరవాణా కేసు నమోదు చేస్తుండటం వల్లే రాష్ట్రంలో సంఖ్య ఎక్కువ కనిపిస్తోందని తెలంగాణ పోలీస్‌శాఖ చెబుతోంది.
సోనాయి నది మీదుగా..రాష్ట్రంలో నమోదవుతున్న లైంగిక అక్రమరవాణా కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలోనే సింహభాగం ఉన్నాయి. ఉద్యోగాలు.. మంచి వేతనంతో కూడిన పని.. పేరిట అమ్మాయిల్ని వంచిస్తున్న ముఠాలు తర్వాత వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాయి. అంతర్జాతీయ అక్రమరవాణా ముఠాలైతే బంగ్లాదేశ్ నుంచి యువతుల్ని హైదరాబాద్ సహా దేశంలోని పలు మెట్రోనగరాలకు తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్-పశ్చిమ్‌బెంగాల్ సరిహద్దులగుండా ప్రవహిస్తున్న సోనాయి నదిలో నాటుపడవల ద్వారా అమ్మాయిల్ని అక్రమంగా తీసుకొస్తున్న రుహుల్ అమీన్ డాలీ, జస్టిన్ ముఠాలు.. అక్కడి నుంచి రైళ్లలో మెట్రోనగరాలకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గుర్తించింది.
18 ఏళ్లు దాటిన వారంతా అమ్మాయిలే..2021లో నమోదైన 347 మానవ అక్రమ రవాణా కేసుల్లో బాధితుల సంఖ్య 796. వీరిలో మహిళలు 659 కాగా.. పురుషుల సంఖ్య 137. మొత్తం బాధితుల్లో 777 మంది భారత్‌కు చెందినవారే. మొత్తం బాధితుల్లో 584 మందిని వ్యభిచార కూపాల్లోకి.. 202 మందిని వెట్టిచాకిరీ వ్యవస్థలోకి దింపినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. 18లోపు వయసు బాధితుల్లో బాలురు 137 మంది.. బాలికలు 85 మంది ఉన్నారు. 18 ఏళ్ల వయసు పైబడిన బాధితులు 574 మంది ఉన్నారు. వీరంతా అమ్మాయిలే. అంటే వీరిని వ్యభిచారకూపాల్లోకి తరలించడమే ముఠాల లక్ష్యమని స్పష్టమైంది. కొందరిని మాత్రం గల్ఫ్ దేశాల్లో ఇళ్లలో పనిమనుషులుగా తరలిస్తున్నారు.