హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన ఓ చోరీకి సంబంధించిన కేసును.. పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి 2.7తులాల బంగారు ఆభరణం, ఓ సెల్ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ పురుషోత్తం తెలిపారు.
పోలీసులు కథనం ప్రకారం
ఇంజినీరింగ్ చదివి.. చెడు వ్యసనాలకు బానిసైన నవీన్(30) దొంగతనాలు ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు. అద్దె ఇల్లు కోసమంటూ.. ఒంటరి మహిళలున్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్నాడు. అదే విధంగా స్థానిక గౌతమినగర్లోని ఓ ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేశాడు. బాధితురాలి ఒంటిపైనున్న మంగళ సూత్రాన్ని దొంగిలించి పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా మూడు గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. బంగారు గొలుసును కొనుగోలు చేసిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ పురుషోత్తం తెలిపారు.
ఇదీ చదవండి:పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి