తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2021, 12:50 PM IST

ETV Bharat / crime

'రూ.2 లక్షలు ఇవ్వండి.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. పెబ్బేరు పోలీసు స్టేషన్ పరిధి సహా వనపర్తి, ఉండవల్లి, మానోపాడు, గద్వాల ప్రాంతాల్లో 28 మంది వీరి మాయలో పడి మోసపోయినట్లు తెలిపారు.

fraud gang who are cheating in the name of jobs got arrested in wanaparthy
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట లక్షలు టోకరా

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలు కాజేసిన ముఠాను వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా వ్యాప్తంగా.. ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున.. మొత్తం 28 మంది నుంచి దాదాపు రూ.81 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్​కు చెందిన విజయ్ కుమార్, సికింద్రాబాద్​లో నివాసముండే స్వప్న, వడ్డే సునీల్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మూడేళ్లుగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవెల్లికి చెందిన మధుకుమార్ ఉద్యోగం కోసం డబ్బులిచ్చాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం లేక, డబ్బులూ తిరిగి రాకపోయేసరికి స్వప్న, సునీల్ కుమార్​లను మధుకుమార్ నిలదీశాడు.

ఇతర యువకుల నుంచి ఉద్యోగం పేరిట డబ్బు వసూల్ చేస్తే.. అందులో కొంత భాగం ఇస్తామని వారు నమ్మించగా.. మధుకుమార్ కూడా ఈ రంగంలోకి దిగాడు. జోగులాం గద్వాల జిల్లాలోని ఉండవెల్లి, మానోపాడు, గద్వాల ప్రాంతాలకు చెందిన పలువురు యువకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసగించాడు. బాధితుల్లో ఒకరు పెబ్బేరు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్వప్న, సునీల్ కుమార్, మధు కుమార్​లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీలైనంత త్వరలో వారిని అరెస్టు చేస్తామని వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ మోసాల ద్వారా వచ్చిన డబ్బుతో నిందితులు కొనుగోలు చేసిన కారు, రూ. లక్షా 80వేల నగదు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పెబ్బేరు పోలీసు సిబ్బందిని ఎస్పీ అపూర్వా రావు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details