Road Accidents in Choutuppal: పండుగ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా గడపాల్సిన వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు ఒకే జిల్లాలో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి.
తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధి దివీస్ ల్యాబ్ సమీపంలో ఒకే స్థలంలో రెండు గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి. మొదట ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టగా సాయిలు అనే వ్యక్తి మృతిచెందాడు. అతని కుమారుడు నగేష్‌కు తీవ్రగాయాలయ్యాయి.
గంటల వ్యవధిలోనే..
ఈ దుర్ఘటన జరిగిన రెండు గంటల తర్వాత అదే స్థలంలో... ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకుల తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని రసాయన కంపెనీలో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
యూటర్న్ తిరుగుతుండగా
ఈ తెల్లవారుజామున మండల పరిధిలోని ధర్మోజీగూడెం వద్ద మలుపు తిరుగుతున్న కారును.. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఘటనలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా భజరంగ్‌దళ్ సభ్యులుగా పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా మృతులతో చౌటుప్పల్ మార్చురీ నిండిపోయింది.
ఇదీ చదవండి:Fire Accident in Military Club: సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం.. రూ.20 కోట్ల ఆస్తినష్టం!