Fire Accident at Boyaguda Today : బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వలస వచ్చారు. కానీ వాళ్ల బతుకులు బుగ్గిపాలవుతాయని ఊహించలేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించారు. ఇలా ఓ ప్రమాదం వారి శ్రమతో పాటు వాళ్లను కూడా బూడిద చేసి.. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుందని అనుకోలేదు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం ఎండనక.. వాననక కష్టపడ్డారు. కానీ వారితో పాటు వారి పిల్లల జీవితాలు కూడా అగ్గిలో బూడిదవుతాయని ఆలోచించలేకపోయారు. రాత్రంతా కష్టపడి.. రేపటి మీద ఆశతో.. రెట్టింపు కష్టపడాలని ఆలోచిస్తూ.. జీవితం గురించి కలలు కంటూ నిద్రపోయిన వాళ్లంతా.. అదే వారికి ఆఖరి రాత్రి అవుతుందని ఊహించలేకపోయారు. తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయగూడ టింబర్‌డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు అక్కడికక్కడే బూడిదయ్యారు.
Fire Accident in Timber Depot : సికింద్రాబాద్ బోయగూడలో తెల్లవారుజామున 4 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలోని తుక్కు గోదాములో మంటలు చెలరేగి.. పైనున్న టింబర్ డిపోకు వ్యాపించాయి. డిపో నిండా కట్టెలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి అక్కడే నిద్రిస్తున్న 11 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో కొంత మంది సజీవదహనం కాగా.. మరికొంత మంది పొగతో ఊపిరాడక చనిపోయారు.
ఘటన జరిగిన సమయంలో టింబర్ డిపోలో 12 మంది కార్మికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఓ వ్యక్తి మంటలు వ్యాపించగానే అప్రమత్తమై భవనంపై నుంచి దూకాడాని చెప్పారు. ఆ విధంగా మంటల నుంచి సురక్షితంగా బయటపడ్డాడని వెల్లడించారు. భవనంపై నుంచి దూకడం వల్ల గాయపడిన ఆ వ్యక్తికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులను పోలీసులు పేర్కొన్నారు.
స్క్రాప్ గోదాము నుంచి టింబర్ డిపోకు..
Boyaguda Fire Accident : స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉండటం వల్ల తుక్కు గోదాము నుంచి మంటలు టింబర్ డిపోకు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వెల్లడించారు. దట్టంగా వ్యాపించిన పొగ వల్ల మృతదేహాల వెలికితీతలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
ఎయిర్ అంబులెన్స్‌లో స్వస్థలాలకు మృతదేహాలు
బోయగూడ అగ్నిప్రమాద స్థలిని హోంమంత్రి పరిశీలించారు. గాంధీ మార్చురీలో మృతదేహాల గుర్తింపు జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే ఆరుగురి మృతదేహాల గుర్తింపు పూర్తైందని చెప్పారు. ఇంకా ఐదుగురి మృతదేహాల గుర్తింపు జరగాల్సి ఉందని అన్నారు. మృతదేహాలను ఎయిర్ అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపిస్తామని వెల్లడించారు. అనధికరికంగా ఉన్న గోదాంలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.