వాహనాలు తగలబడటానికి కారణమేంటి...? ఎలా నివారించాలి..? - fire accidents in summer
అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగిన ఘటనలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అగ్నిప్రమాదంలో కార్ల తలుపులు బిగుసుకు పోయి కొందరు కారులోనే సజీవదహనమైన ఘటనలు గతంలో జరిగాయి. అసలు వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు ఎందుకు చెలరేగుతాయి.. ప్రమాదాలకు కారణాలేంటి..? వాటిని ఎలా నివారించవచ్చని నిపుణులను ప్రశ్నిస్తే ఇలా చెబుతున్నారు.
fire accident in cars in summer
By
Published : Mar 9, 2021, 10:30 AM IST
ఎండ తీవ్రత తోడైతే...
ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు కారు వేడెక్కుతుంది. దానికి ఎండ తీవ్రత తోడైతే.. డ్యాష్ బోర్డులోని ఎలక్ట్రికల్ వైరింగ్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు ఫ్యూజ్‌లు కాలిపోయి, దాని బాక్స్ కరిగిపోయి నిప్పురవ్వలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కారు లోపలి భాగంలో మంటలు చెలరేగవచ్చు. పాత మోడల్ కార్లలో ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఉష్ణోగ్రత పెరిగిపోయి. కూలెంట్ కారిపోయి..
సాధారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కారు ఇంజిన్‌లో వేడి ఎక్కువై ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదే సమయంలో కూలెంట్ కారిపోతే రేడియేటర్ పరిసరాల్లో ఉండే ప్లాస్టిక్ వస్తువులు వేడెక్కి మంటలు అంటుకునే అవకాశం ఉంది.
బ్యాటరీ ఓవర్ ఛార్జింగ్...
పలు సందర్భాల్లో బ్యాటరీల వల్ల మంటలు అంటుకునే అవకాశముంది. డైనమో సెల్ఫ్ మోటార్‌లో లోపం వల్ల బ్యాటరీ ఓవర్ ఛార్జింగ్‌తో ఉబ్బిపోయి పేలిపోతుంది. దానివల్ల నిప్పు రవ్వలు ఎగిసి ఇంజన్ భాగంలోని ఆయిల్స్ వాటికి తోడై మంటలు వ్యాపించవచ్చు.
టైర్లు బలహీనంగా ఉంటే...
కారులో చాలా దూరం ప్రయాణించినప్పుడు టైర్లు బలహీనంగా ఉంటే అవి ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం ఉంది. అలా పేలిపోయినప్పుడు కారు మంచి వేగంతో ఉంటే టైరు రిమ్స్ రోడ్డుకు రాసుకుపోయి నిప్పురవ్వలు వచ్చి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి.
సైలెన్సర్‌పై ఇంధనం పడి...
కారు బయట నుంచి మంటలు అంటుకోవడానికి ఎక్కువగా సైలెన్సర్స్ కారణమవుతాయి. కారు వెనుక సీటు కింద పెట్రోల్/డీజిల్ ట్యాంకులు ఉంటాయి. ట్యాంకు నుంచి ఇంధనం లీక్ అయి సైలెన్సర్‌పై పడినప్పుడు మంటలు చెలరేగి ఒక్కసారిగా కారును చుట్టుముట్టే ప్రమాదముంది.
పరిశీలించి ప్రయాణం చేయాలి "వేసవిలో దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు కారు పనితీరును పరిశీలించుకోవాలి. బ్యాటరీ, కూలెంట్, టైర్లు ప్రత్యేకంగా చెక్ చేసుకోవాలి. ఇంజిన్ ఉష్ణోగ్రతపై ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ ఉండాలి. పాత కార్లలో ప్రయాణిస్తున్న సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కారు ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలి. కారుల్లో తలెత్తిన లోపాల్ని తెలిపే సదుపాయాలు ఆధునిక కార్లలో అమర్చుతున్నారు. అయితే వీటిని పట్టించుకోకుండా ప్రయాణం చేయడం ప్రమాదాలకు కారణమవుతోంది." - వివేక్, కారు మెకానిక్, బంజారాహిల్స్
ప్రయాణిస్తున్న కారులో మంటలు.. ఆర్పిన ట్రాఫిక్ పోలీసులు
రాష్ట్ర సచివాలయం సమీపంలో కారు తగులబడి ఉరుకులు పరుగులు పెట్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహీంద్రా వెరిటో ఊబర్ క్యాబ్ సోమవారం మధ్యాహ్నం మలక్‌పేట నుంచి ప్రయాణికులతో అమీర్‌పేటకు వెళ్తోంది. ఏసీ ఆన్‌చేసిన కాసేపట్లోనే ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం దాటి బీఆర్‌కే భవన్ సమీపంలోకి చేరుకున్న సమయంలో కారు ముందు భాగంలో పొగలు వచ్చాయి. కారు డ్రైవర్ కమ్ ఓనర్ వేణుగోపాల్ కారును పక్కకు ఆపి వెంటనే లోపల ఉన్న వారిని కిందకు దింపారు. క్షణాల్లో పొగలు ఎగజిమ్ముతూ మంటలు లేవడంతో తెలుగు తల్లి కూడలిలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్, ఏఎస్‌ఐ జిలాని, హోంగార్డు వెంకటేష్ పలువురు స్థానికులు స్పందించారు. ఫ్లైఓవర్ కింద గల మొక్కలకు నీరు పోసే పైపులైన్ ఉండటంతో దాన్ని అందుకుని నీరు పోస్తూ, మరో వైపు మట్టిని చల్లుతూ మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అగ్నిమాపక యంత్రం మంటల్ని పూర్తిస్థాయిలో ఆర్పివేసింది. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.