గుంటూరు జిల్లా సత్తెనపల్లి పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన షేక్ బాజి(27) ఆటోనగర్ ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నారు. రాత్రిపూట శ్రీలక్ష్మి మారుతి పాల ఉత్పత్తుల విక్రయ దుకాణంలో పనిచేస్తున్నారు. 15 రోజుల కిందట రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన యువకుడు పల్లపు కోటివీరయ్య.. సిగరెట్లు, నీళ్లసీసా తీసుకుని, రూ.50 బిల్లును ఫోన్‌పే చేశాడు. నగదు తన ఖాతాకు రాలేదని దుకాణ యజమాని పెండ్లి వైకుంఠవాసు చెప్పగా... బదిలీ ప్రాసెస్‌లో ఉందని, ఒకవేళ రాకుంటే ఉదయం ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
యాభై రూపాయల పంచాయితీ.. యువకుడు మృతి ఆ నగదు రాకపోవడం, కోటివీరయ్య చెల్లించకపోవడంతో నాలుగు రోజుల క్రితం కోటివీరయ్య తమ్ముడు నాగేశ్వరరావును దుకాణంలో పనిచేసే బాజి... రూ.50 ఇవ్వాలని అడిగాడు. మంగళవారమూ మరోసారి అతన్ని డబ్బులు అడగడంతో వాటినిచ్చి కోపంగా ఇంటికి వెళ్లాడు. బుధవారం రాత్రి కోటివీరయ్య దుకాణం వద్దకు వచ్చి తాను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తన తమ్ముడిని ఎందుకు అడిగారని వాసు, బాజిలను ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య రోడ్డుపై గొడవ జరిగింది.
యజమానిని దుకాణంలోకి తీసుకొచ్చిన బాజి... బయట ఉన్న కోటివీరయ్య, నాగేశ్వరరావు, వారి స్నేహితుడు తిరుమల్లేశ్వరరావు అలియాస్ పప్పుతో మాట్లాడేందుకు వెళ్లాడు. అనూహ్యంగా వారితో జరిగిన ఘర్షణ కారణంగా దెబ్బలు తగిలి అతడు స్పృహతప్పి కింద పడిపోయాడు. వెంటనే బాజిని ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
తన భర్త మృతికి పల్లపు కోటివీరయ్య, నాగేశ్వరరావు, తిరుమల్లేశ్వరరావు, పాల దుకాణం నిర్వాహకులు పెండ్లి వైకంఠవాసు, లక్ష్మీమారుతి, పండ్ల వ్యాపారి షేక్ మహబు అలియాస్ సుప్రీం కారణమని బాజి భార్య సైదాబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ వివరించారు. బాజి మరణంతో అతని కొడుకులు అహిల్(3), అమీర్(1)లు అనాథలయ్యారు. భర్త లేకుండా పిల్లలతో ఎలా జీవించాలని సైదాబి రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది.
ఇదీ చదవండి:కొంపముంచిన ఆన్లైన్ స్నేహం- బాలికపై గ్యాంగ్ రేప్