సమాజంలో బంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు మరిచి ప్రవర్తించడమేగాకుండా... స్వల్పకాల సుఖాల కోసం ప్రాణాలను సైతం తీస్తున్నారు. కడుపున పుట్టిన బిడ్డలైనా... కన్నవాళ్లనైనా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
కోడలితో వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించాడా తండ్రి. ఆమెతో కలిసి కుమారుడిని హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన కరుణయ్య, మరియమ్మ భార్యాభర్తలు. వీరి కుమారుడు లక్ష్మయ్య (35)కు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతకు పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. మరియమ్మ ముప్పై ఏళ్ల క్రితమే చనిపోయారు. లక్ష్మయ్య మద్యానికి బానిసై ఆ మత్తులో ఉండేవాడు. ఈ క్రమంలో మామ కరుణయ్య, కోడలు సునీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని అద్దంకి సీఐ రాజేష్, ఎస్సై వి.శివన్నారాయణ తెలిపారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష్మయ్యను హత్య చేసేందుకు వారు కుట్ర పన్నారని పేర్కొన్నారు.