Farmer suicides in AP: ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. 2020లో 889 మంది బలవన్మరణాలకు పాల్పడగా 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 19.79 శాతం పెరుగుదలతో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది దేశవ్యాప్తంగా 10,881 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకోగా వారిలో 1,065 (9.78 శాతం) మంది ఏపీ వారే ఉండటం కలవరం కలిగిస్తోంది. దీని ప్రకారం ఏపీలో రోజుకు సగటున ముగ్గురు రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జాతీయ నేర గణాంక సంస్థ ఆదివారం రాత్రి విడుదల చేసిన ‘ప్రమాద మరణాలు- ఆత్మహత్యల సమాచార నివేదిక-2021’ ఈ వివరాలను వెల్లడించింది. ప్రధానాంశాలివీ..
భూమి ఉన్న రైతులే బలవన్మరణం..ఆత్మహత్యకు పాల్పడినవారిలో 481 మంది రైతులు కాగా, 584 మంది రైతు కూలీలుగా ఉన్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ 481 మంది వ్యవసాయదారుల్లో 359 మంది సొంత భూమి ఉన్నవారే. 122 మంది కౌలుదారులు.