Farmer Suicide : అటవీశాఖ అధికారులు పోడు భూములను తీసుకోవడంతో ఓ పోడురైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో జరిగింది. అటవీ అధికారుల చర్యతో.. గ్రామానికి చెందిన కల్తీ కన్నయ్య (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కల్తీ కన్నయ్యకు భార్య సమ్మక్క ముగ్గురు కుమారులు ఉన్నారు. కన్నయ్య తనకున్న పోడుభూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే గతంలో కొంత భూమిని అటవీ శాఖ అధికారులు కందకాల తవ్వకం పేరుతో తీసుకోగా... కుమారులతో కలిసి మిగిలిన భూమినే సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోడు భూమి పట్టాకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సమయంలో అటవీ అధికారులు మిగిలిన భూమిని తీసుకోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. కన్నయ్యను కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. అటవీశాఖ అధికారుల చర్యలతోనే కన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.