Fake Certificates Gang: ఇతర రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన డిగ్రీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయానికి చెందిన సహాయ ఆచార్యుడితో పాటు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్న శ్రీకాంత్, మహేశ్వర్, ఏడుగురు విద్యార్థులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
సర్టిఫికెట్లకు లక్షలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శ్రీకాంత్.. దిల్‌సుఖ్‌నగర్‌లో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల వివరాలు సేకరించి... వాళ్లకు ఫోన్ చేసి ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లు ఇస్తానని ఆకర్షిస్తాడు. ఆ తర్వాత ఒక్కో డిగ్రీ సర్టిఫికెట్‌కు కనీసం లక్ష రూపాయలు వసూలు చేసి బీటెక్, పీజీ, డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడు. దుబ్బాకలోని రామక్కపేటకు చెందిన మహేశ్వర్ సైతం అత్తాపూర్‌లో ప్రైడ్ ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. గత ఐదేళ్లుగా ఇతను కూడా బోపాల్‌లోని స్వామి వివేకానంద విశ్వవిద్యాలయం, సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయానికి చెందిన సహాయ ఆచార్యుడు కేతన్‌సింగ్ సహకారంతో శ్రీకాంత్, మహేశ్వర్ సర్టిఫికెట్లను విద్యార్థులకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.