ప్రభుత్వ ఉద్యోగాల ఆశచూపి... నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తున్న నిందితున్ని హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ ప్రాంతానికి చెందిన పానుగంటి నవీన్... ప్రస్తుతం హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. తనకు తాను ఒక సీఐబి (సెంట్రల్ ఇన్పర్మేషన్ బ్యూరో)కి చెందిన అధికారిగా నిరుద్యోగులకు పరిచయం చేసుకొని నమ్మిస్తుంటాడు. ఇందుకోసం ఒక నకిలీ తుపాకీ, ఐడీ కార్డు సైతం సృష్టించాడు.
ఉద్యోగాల ఆశజూపి... లక్షలు దోచేసి... - నిరుద్యోగులే లక్ష్యం
నిరుద్యోగులే లక్ష్యంగా చేసుకుని లక్షలు దోచుకుంటున్న ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా ఘన్‌పూర్ మండలానికి చెందిన ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో హన్మకొండ పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. నిందితుని నుంచి ఒక బొమ్మ తుపాకి, కారు, రెండు పోలీస్ లాఠీలు, రెండు నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే జనగామ జిల్లా ఘన్‌పూర్ మండలానికి చెందిన వినోద్ కుమార్ అనే యువకుడిని నమ్మించాడు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2019 నుంచి అతని వద్ద రూ.10 లక్షల 20 వేల నగదు తీసుకున్నాడు. నగదు ముట్టిన తర్వాత నిందుతుడు ముఖం చాటేయటం వల్ల మోసపోయానని గ్రహించిన బాధితుడు హన్మకొండ పోలీసులకు పిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. నిందితుడికి సహకరించిన తండు అశోక్ కుమార్... పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నవీన్‌పై గతంలో హైదరాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక బొమ్మ తుపాకి, కారు, రెండు పోలీస్ లాఠీలు, రెండు నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగులు ఎవరూ... దళారులను నమ్మి మోసపోవద్దని ఏసీపీ జితేందర్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఒక నియామక సంస్థ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి... పూర్తి పారదర్శకంగా జరుగుతాయని వివరించారు.