తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆరుగురు సజీవదహనం కేసు.. ఇంటికి నిప్పు పెట్టింది ఆమేనట..! - 6 people were burnt alive in Mancherial district

Mancherial District Fire Accident updates: మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవదహనం కేసును పోలీసులు చేధించారు. ఆరుగురి మృతికి వివాహేతర సంబంధం, కక్షలే కారణమని గుర్తించారు. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే కారణంతో ఓ మహిళ ఇంటికి నిప్పు పెట్టినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

Mancherial District Fire Accident updates
Mancherial District Fire Accident updates

By

Published : Dec 18, 2022, 7:05 AM IST

Updated : Dec 18, 2022, 1:00 PM IST

Mancherial District Fire Accident updates: అర్ధరాత్రి..ఓ ఇంట్లో నుంచి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అవి తీవ్రమయ్యాయి. గంట వ్యవధిలోనే పైకప్పు పెంకులు చుట్టూ ఎగిరిపడ్డాయి. తీరాచూస్తే ఆ ఇంట్లో ఆరుగురు సజీవ దహనమై బూడిద కుప్పలా మారారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని ఓ పల్లెలో జరిగిన ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మృతుల్లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సహా అందరూ గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం చూసి హడలిపోయారు.

ఆరుగురు సజీవదహనం కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పెట్రోల్‌ బంక్‌లో 40 లీటర్ల పెట్రోల్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధరణ వచ్చారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. శాంతయ్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారి కుటుంబీకులు నిరాకరించారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ సిబ్బందికి మృతదేహాన్ని అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారు.

సింగరేణి ఉద్యోగి వివాహేతర సంబంధం కారణంగా ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న గొడవలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం ఆయన భార్య, తన ప్రియుడి సాయంతో ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తేలింది. ఏసీపీ ప్రమోద్‌ మహాజన్‌ కథనం, విశ్వసనీయ సమాచారం మేరకు..గుడిపెల్లి (వెంకటాపూర్‌) గ్రామంలో మసా పద్మ (45), శివయ్య (50) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఓ కుమార్తె నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు నస్పూర్‌లో, రెండో కుమార్తె హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

కుమార్తె అంత్యక్రియల కోసం దంపతులు మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి, అప్పట్నుంచి అక్కడి పెంకుటింట్లోనే ఉంటున్నారు. పద్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సింగరేణిలో మజ్దూర్‌గా పనిచేస్తున్న శనిగారపు శాంతయ్య అలియాస్‌ సత్తయ్య (57) ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. కొండంపేటకు చెందిన నెమలికొండ మౌనిక (23), తన ఇద్దరు పిల్లలు ప్రశాంతి (2), హిమబిందు (4)తో కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దమ్మ పద్మ ఇంటికి వచ్చి అక్కడే ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో పోలీసులకు, అగ్నిమాపక శకటానికి సమాచారం అందించారు. వారు వచ్చేసరికే ఇంట్లో ఉన్న ఆరుగురూ సజీవ దహనమయ్యారు.

ఉద్యోగం కోసం ఒత్తిడి, ఆస్తుల గొడవలు:శనిగారపు శాంతయ్య స్వగ్రామం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉట్కూర్‌. శ్రీరాంపూర్‌ భూగర్భ గనిలో ఉద్యోగం చేసే ఆయనకు భార్య సృజన, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ చదువుకుని, నిరుద్యోగులుగా ఉన్నారు. వీరంతా గోదావరిఖనిలో నివాసం ఉంటున్నారు. పదేళ్ల క్రితం శాంతయ్యకు..శ్రీరాంపూర్‌లో సింగరేణి అధికారుల గృహాల్లో పనిచేసే పద్మతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో కొంతకాలంగా ఆయన ఆమెతోనే ఉంటున్నారు. ఈ విషయమై ఆయనకు, భార్య సృజనకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో సృజన కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం.


సింగరేణి ఉద్యోగులు పదవీ విరమణకు రెండేళ్ల ముందు అన్‌ఫిట్‌గా ధ్రువీకరణ పొందితే వారసులకు ఉద్యోగం వస్తుంది. ఈ నేపథ్యంలో అన్‌ఫిట్‌గా మారాలంటూ శాంతయ్యపై భార్య, కుమారులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలోనూ కుటుంబ సభ్యుల్లో మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. దీనికితోడు తన తండ్రి జీతభత్యాల తాలూకూ డబ్బంతా తాను సహజీవనం చేస్తున్న మహిళకే ఇస్తుండటం, ఉత్కూర్‌లో స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ.25 లక్షలూ ఆమెకే ఇచ్చినట్టు అనుమానాలుండటంతో కుటుంబ సభ్యులు ఆయనపై కక్ష పెంచుకున్నట్టు తెలిసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల కిందట ఒకసారి, మూడు నెలల క్రితం మరోసారి శాంతయ్యపై హత్యాయత్నాలు జరిగాయి. ఒకసారి కిడ్నాప్‌ కూడా జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భర్త సహా ఆయన సహజీవనం చేస్తున్న మహిళ కుటుంబాన్ని అంతమొందించే క్రమంలో సృజన సూచన మేరకు ఆమె ప్రియుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.

చుట్టపు చూపుగా వచ్చి ప్రమాదంలోకి:పద్మ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమె చెల్లెలు కుమార్తె, కొండంపేటకు చెందిన మౌనిక పెద్దమ్మను పరామర్శించేంద]ుకు ఇద్దరు పిల్లలతో ఐదు రోజుల క్రితం గుడిపెల్లికి వచ్చింది. ఇంతలోనే సజీవ దహనం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

మత్తు మందు ఇచ్చి... నిప్పంటించారా?

ఘటన జరిగిన ఇంటి వెనుకవైపున టైర్లు సగం కాలిన స్థితిలో ఉన్నాయి. వాటికి కొద్ది దూరంలోనే 20 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు పెట్రోలు డబ్బాలు ఉన్నాయి. దీన్నిబట్టి నిందితులు ఇంటి తలుపు సందుల్లోంచి పెట్రోల్‌ పోసి నిప్పంటించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘మంటలు చుట్టుముడుతున్నా ఇంట్లోంచి అరుపులు వినిపించలేదని స్థానికులు చెప్పడాన్ని బట్టి ఆరుగురూ మత్తులో ఉండే అవకాశాలున్నాయి. ఆ ప్రకారం చూస్తే ప్రణాళిక ప్రకారం మత్తు ఇచ్చి ఉండటమో లేదా ముందుగానే చంపేసి తర్వాత తగలబెట్టడమో చేసి ఉంటారనే’’ అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Dec 18, 2022, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details