Extreme tension in Dammaiguda: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ పరిధిలోని జవహర్ నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు (10) మృతదేహాన్ని అనుమానాస్పద రీతిలో చెరువులో గుర్తించారు. దమ్మాయిగూడలోని అంబేడ్కర్ నగర్ చెరువు నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీసి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
అనంతరం మృతదేహాన్ని జవహర్‌నగర్‌కు తీసుకొచ్చిన క్రమంలో స్థానికులు ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం నివేదిక ఇచ్చిన తర్వాతే ఇందు మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్‌లో నుంచి బాలిక మృతదేహాన్ని కిందకు దించకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసు వాహనం, అంబులెన్స్ గంట నుంచి అక్కడే ఉన్నాయి. స్థానికులు, బాలిక బంధువులు అడుగడుగునా అడ్డుకుని ధర్నాకు దిగారు.
బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల ఆందోళనతో జవహర్‌నగర్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. పాప ఎందుకు మృతి చెందిందో కారణాలు తెలిపే శవపరీక్ష నివేదికను తమకు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఇవ్వకుండా చిన్నారి మృతదేహం అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాప మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక దశలో పోలీసు వాహనంపై దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. చిన్నారి ఇందు మృతికి నిరసనగా దమ్మాయిగూడ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తి ర్యాలీని కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎక్స్రైషియా ప్రకటించాలని, ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.