student Suicide Case: ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై వేటు పడింది. గంగవరం జెడ్పీ హైస్కూల్లో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ.. డీఈవో శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు. మిస్బా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పలమనేరు డీఎస్పీ కార్యాలయం ముందు మిస్బా కుటుంబీకులు ధర్నా చేపట్టారు.
పలమనేరు బ్రహ్మర్షి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మిస్బా.. మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల కరస్పాడెంట్ వేధింపుల వల్లే మిస్బా బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్.. తన భార్య పేరిట బ్రహ్మర్షి పాఠశాల నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
మిస్బా మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలి: అంతకుముందు పలమనేరు డీఎస్పీ కార్యాలయం ముందు మిస్బా కుటుంబీకులు ధర్నా చేపట్టారు. మిస్బా మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను వదిలేసి బాధితులను వేధిస్తున్నారని మిస్బా కుటుంబం ఆరోపించారు. ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు భద్రత కల్పించట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.