రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నసైబర్ మోసాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. విభిన్న మార్గాల్లో సమాజంలో చొచ్చుకొస్తున్న సైబర్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. జనాలు ఈ నేరగాళ్ల బారినపడి నిత్యం వేలు, లక్షల్లో కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన కార్తీక్ అనే వ్యక్తికి.. గత సెప్టెంబర్‌లో పోస్టు ద్వారా ఓ స్క్రాచ్ కార్డు వచ్చింది. మీకు ఇన్నోవా కారు వరించిందని... బహుమతి పొందేందుకు కింది నంబరుకు ఫోన్ చేయాలని అందులో రాసి ఉంది. స్పందించిన కార్తీక్ ఆ నంబరుకు ఫోన్ చేయగా... పలు కారణాలు చెప్పి విడతల వారీగా 95వేలు వసూలు చేశారు. కారు కోసం వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన కార్తీక్.. సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితులు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.
షాపింగ్ చేసిన వారి వివరాలు
బిహార్‌కు చెందిన ప్రధాన నిందితుడు తరుణ్‌కుమార్... గతంలో పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అందులో నష్టం రావడంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు.. మోసాలు చేయడం మొదలుపెట్టాడు. పలు ఈ కామర్స్ వెబ్‌సైట్లో పనిచేస్తున్న అలోక్, తిరాంజు వద్ద నుంచి షాపింగ్ చేసిన వారి వివరాలు సేకరిస్తున్నాడు.