తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Crimes: వాట్సాప్ గ్రూపులతో జాగ్రత్త.. భారీ లాభాల ఎరతో రూ.లక్షల్లో టోకరా

Cyber Criminals Creating What's App groups: బిట్‌కాయిన్‌, షేర్‌ట్రేడింగ్‌లాంటి వ్యాపారాల్లో పెట్టుబడులకు భారీ లాభాలొస్తాయంటూ ఆకర్షణీయ ప్రకటనలతో గాలమేస్తున్నారు సైబర్​ నేరస్థులు. అది కూడా ఎక్కడో కాదు వాట్సాప్​ గ్రూపుల్లో. అనుమతి లేకుండానే వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో మీ నంబర్​ను చేర్చి.. అదే గ్రూపుల్లో సైబర్​ ముఠా సభ్యులు చేరిపోతున్నారు. స్వల్ప వ్యవధిలోనే లాభాలంటూ ఊదరగొడతారు. ఏ మాత్రం ఆ ప్రకటనలకు లొంగారో మీ జేబులకు చిల్లు పడినట్లే. తర్వాత ఎంత బాధపడినా ఫలితం ఉండదు.

Cyber Crimes, Cyber Criminals Creating What's App groups
వాట్సప్ గ్రూపులతో జాగ్రత్త

By

Published : Dec 14, 2021, 8:16 AM IST

Updated : Dec 14, 2021, 8:27 AM IST

Cyber Criminals Creating What's App groups: సైబర్‌ నేరస్థులు రోజుకో తీరుతో బాధితులకు గాలమేస్తూనే ఉన్నారు. గతంలో మెయిల్‌కు లింక్‌లు పంపి వల విసిరిన మోసగాళ్లు.. తాజాగా వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా అమాయకులను ముగ్గులోకి దించుతున్నారు. అనుమతి లేకుండానే వాట్సప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో పలువురి ఫోన్‌ నంబర్లను చేర్చుతున్నారు. కొన్ని సందర్భాల్లో టెలికాం ఆపరేటర్ల నుంచి ఈ నంబర్లను సేకరిస్తున్న మోసగాళ్లు.. మరికొన్ని సందర్భాల్లో రాండమ్‌గా నంబర్లను ఎంచుకొని గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. బిట్‌కాయిన్‌, షేర్‌ట్రేడింగ్‌లాంటి వ్యాపారాల్లో పెట్టుబడులకు భారీ లాభాలొస్తాయంటూ ఆకర్షణీయ ప్రకటనలతో గాలమేస్తున్నారు. ఇవే గ్రూపుల్లో కొందరు ముఠాసభ్యులూ చేరిపోయి, స్వల్పవ్యవధిలోనే లాభపడ్డామంటూ ఊదరగొడుతున్నారు. ఎవరైనా నమ్మి స్పందిస్తే చాలు చాటింగ్‌లతో రంగంలోకి దిగి అందినకాడికి దోచుకుంటున్నారు.

  • సనత్‌నగర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(32) నంబరును గుర్తుతెలియని వ్యక్తి ఒకరు +(747)3440897 నంబరుతో వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చాడు. అందులో క్యాపిబేజ్‌.కామ్‌ సంస్థ వెబ్‌సైట్‌ లింక్‌ను షేర్‌ చేశాడు. దానిలో పెట్టుబడి పెడితే ఆకర్షణీయ లాభాలొస్తాయన్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అదే గ్రూప్‌లోని భారతీయుల ఫోన్‌ నంబర్లను సంప్రదిస్తే అద్భుతమైన సంస్థంటూ కితాబిచ్చారు. దీంతో ఆయన ఆన్‌లైన్‌ లావాదేవీలతో రూ.2.62లక్షలు పెట్టుబడి పెట్టారు. మూడు రోజుల తర్వాత గ్రూప్‌ నుంచి తన నంబరును తొలగించడంతో మోసపోయానని గ్రహించారు. ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • మేడ్చల్‌ గౌడవెల్లికి చెందిన వ్యాపార విశ్లేషకురాలు(27) ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు స్టెల్లాబ్రూక్లిన్‌ పేరిట సందేశం వచ్చింది. షేర్ల ట్రేడింగ్‌లో రూ.15వేల పెట్టుబడికి వారంలోనే రూ.90వేల లాభం వస్తుందనేది సారాంశం. ఆమె ఆసక్తి చూపడంతో నేరస్థులు +1(971)4122688 వాట్సప్‌ నంబరు ద్వారా సంభాషణలు కొనసాగించారు. ‘ఎఫ్‌ఎక్స్‌ట్రేడ్‌ ఫ్యాక్టరీ.కామ్‌’ వెబ్‌సైట్‌లో ఆమె పేరిట ట్రేడింగ్‌ ఖాతా తెరిచారు. అమెరికా ట్రేడింగ్‌ కావడంతో నేరుగా పెట్టుబడి పెట్టలేరని చెప్పిన అపరిచిత వ్యక్తి.. దిల్లీలోని శ్రీశ్యామ్‌ ట్రేడర్స్‌ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకు రూ.15వేలు పంపించాలని సూచించాడు. అనంతరం వేర్వేరు కారణాలు చూపుతూ రూ.5,89,544లను బదిలీ చేయించుకున్నారు. అయినా ఇంకా డబ్బు కట్టాలంటూ సందేశాలు వస్తుండటంతో మోసపోయానని గ్రహించి వారం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విదేశీ నంబర్లను తలపించేలా..

Cyber Crimes: ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నంబరైనా వాట్సప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో చేర్చే అవకాశం ఉండటంతో సైబర్‌ నేరస్థులు విదేశీకోడ్‌లతో కూడిన సెల్‌ఫోన్‌ నంబర్లను వాటిలో చేర్చుతున్నారు. ఆయా నంబర్ల ముందున్న ఎస్టీడీ కోడ్‌ విదేశాలకు సంబంధించినది కావడంతో బాధితులు నిజమేనని నమ్మేస్తున్నారు. వాస్తవానికి స్పూఫింగ్‌ సాంకేతికతతో ఇక్కడి ముఠాలే ఇలా ఏమార్చుతున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీ పెట్టుబడులైతే నైజీరియన్‌ ముఠాలు.. షేర్‌ట్రేడింగ్‌ అయితే దిల్లీ, ముంబయి, బెంగళూరు, గుజరాత్‌లకు చెందిన ముఠాలు వల వేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇలాంటివి గత మూడు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 50 వరకు కేసులు నమోదవడం గమనార్హం.

ప్రైవసీ సెట్టింగులను మార్చుకోవాలి

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కొద్దిరోజులుగా ఇలాంటి మోసాలపై 20 వరకు ఫిర్యాదులందాయి. నిజమైన వ్యాపార సంస్థలెప్పుడూ ఇలా చెప్పకుండానే గ్రూపుల్ని ఏర్పాటుచేయవు. పన్నుల పేరిట పెట్టుబడుల్నీ తీసుకోవు. అందుకే.. మన ప్రమేయం లేకుండా గ్రూపుల్లో చేర్చే వీల్లేకుండా వాట్సప్‌ సెట్టింగ్‌ల్లో మార్పులు చేసుకోవాలి. వరుసగా ‘అకౌంట్‌- ప్రైవసీ- గ్రూప్స్‌’ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి. ‘హు కెన్‌ యాడ్‌ మి టు గ్రూప్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్లాక ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌..’ ఆప్షన్‌లో నచ్చిన నంబర్లను ఎంపిక చేసుకుంటే వారు తప్ప అపరిచితులు కొత్తగా గ్రూప్‌లో చేర్చే అవకాశం ఉండదు.

కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌

ఇదీ చూడండి:Cyber Financial Crimes: 'ఆన్​లైన్​లో డబ్బులు పోయాయా? అయితే 24 గంటల్లో కాల్​ చేయండి'

Last Updated : Dec 14, 2021, 8:27 AM IST

ABOUT THE AUTHOR

...view details