తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఛాటింగ్​తో బుట్టలోవేస్తారు.. ఆపై బురిడీ కొట్టిస్తారు!

ఎవరైనా అపరిచిత యువతులు వాట్సాప్‌ ద్వారా ఛాటింగ్‌ చేస్తున్నా.. వారి ఫొటోలను పంపుతూ రెచ్చగొడుతున్నా అనుమానించాల్సిందే. ఛాటింగ్‌ చేస్తూ మాయలో ముంచి ఓటీపీ నంబర్లు తీసుకుంటారు. వాట్సాప్‌లోని సౌకర్యాల ఆధారంగా రెండో అధికారిక వినియోగదారుగా (టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌) ప్రవేశిస్తారు. దీంతో మన నంబరు హ్యాక్‌ అవుతుంది. ఆ నంబరును ఉపయోగించుకుని సైబర్‌ నేరస్థులు మరికొందరు అమాయకులను ఇలాగే బుట్టలో వేసి వారినుంచి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఏడాది కాలంగా సైబర్‌ నేరగాళ్లు ఈ పంథాను ఎంచుకున్నారు. వాట్సాప్​‌ను హ్యాక్‌ చేయడం ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు.

cyber criminals cheating through WhatsApp
ఛాటింగ్​తో బుట్టలోవేస్తారు.. ఆపై బురిడీ కొట్టిస్తారు

By

Published : Mar 13, 2021, 7:01 AM IST

వాట్సాప్​ ఛాటింగ్​లో మాయమాటలు చెప్పి బుట్టలోవేస్తారు. యాప్​లోని ఆప్షన్స్​ ద్వారా రెండో అధికారిక వినియోగదారునిగా ప్రవేశిస్తారు. ఆపై బెదిరింపు, వసూళ్లకు పాల్పడుతుంటారు. అమాయకులను ఇలాగే బుట్టలో వేసి బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఛాటింగే కాదు వాట్సాప్‌ కొత్తగా ప్రవేశపెట్టనున్న ‘ప్రైవసీ పాలసీ’ని అడ్డం పెట్టుకుని కూడా మోసాలకు దిగుతున్నారు. హ్యాక్‌ చేసిన వాట్సాప్‌ నంబర్‌ ద్వారా ఇతరులకు నగ్నచిత్రాలు, అసభ్య సందేశాలు పంపించి వారిని బెదిరించి డబ్బు గుంజుతుంటారు. బాధితులు ఫిర్యాదు చేసినా ఈ నేరగాళ్ల పేరు, ఊరు, చిరునామా పోలీసులకు లభించదు. ఒకవేళ మన ఫోన్‌ హ్యాక్‌ చేసి ఆ నంబరు ద్వారా ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే నేరం మనమీదకు మళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇలా చేస్తున్నారు..

*వాట్సాప్‌ ప్రొఫైల్‌ చిత్రాలుగా యువకులు, యువతులు, వృత్తి నిపుణులున్న వారిని ఎంచుకుంటారు.

*అనంతరం అందమైన యువతి డీపీ చిత్రంతో వారికి వాట్సప్‌ సందేశాలు పంపుతారు. ధనవంతురాలిగా పరిచయం చేసుకుంటారు.

*కొద్దిరోజులు వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. బుట్టలో పడేయడానికి ఒక్కోసారి నగ్నచిత్రాలనూ పంపుతారు. వీడియోలను షేర్‌ చేసుకుంటారు. గంటలపాటు ఛాటింగ్‌ చేస్తున్నారని తెలుసుకున్నాక హ్యాకింగ్‌కు తెరతీస్తారు.

*హ్యాకింగ్‌ చేసేప్పుడు సైబర్‌ నేరస్థుడు రెండు ఫోన్లు ఉపయోగిస్తాడు. ఒక ఫోన్‌ ద్వారా బాధితుడితో మాట్లాడుతూనే మరో ఫోన్‌తో బాధితుడి ఫోన్‌ నంబరుతో వాట్సప్‌ నంబరు రూపొందిస్తాడు.

*సెట్టింగ్స్‌లో ‘టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌’ (రెండో అధికారిక వ్యక్తి) ఐచ్ఛికాన్ని ఎంచుకుంటాడు.. అక్కడ టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ నొక్కగానే.. ఓటీపీ నంబర్‌ అడుగుతుంది. ఆ నంబరును బాధితుడిని అడిగి తెలుసుకుంటారు. సైబర్‌ నేరస్థుడికి ఓటీపీ పంపించిన వెంటనే.. నిందితుడు వాట్సాప్‌ హ్యాక్‌ చేస్తాడు.

మార్ఫింగ్‌ చేసి.. హెచ్చరికలు..

వాట్సాప్‌ హ్యాక్‌ చేసిన వెంటనే నిందితులు డీపీల్లోని యువతులు లేదా మహిళల ఫొటోలను తీసుకుంటున్నారు. వాటిని మార్ఫింగ్‌ చేసి వారికే పంపుతుంటారు. వీటిని నెట్టింట్లో ఉంచుతాం.. మీకు తెలిసినవారి నంబర్లకు కూడా పంపుతామంటూ బెదిరిస్తున్నారు. పరువు పోతుందన్న భావనతో బాధితులు వారు అడిగినంత నగదు నిందితులు సూచించిన ఖాతాల్లో జమ చేస్తున్నారు.

డబ్బు పంపాలంటూ సందేశాలు

వాట్సాప్‌ సంస్థ కొత్తగా అమలు చేయనున్న ప్రైవేట్‌ పాలసీ ద్వారా ఇప్పటివరకూ మీ ప్రైవేటు సంభాషణలు, ఇతర వ్యవహారాలన్నీ ఆ సంస్థ గుప్పిట్లో ఉంటాయని, అలా జరగకుండా తాము చేస్తామని సైబర్‌ నేరస్థులు వాట్సప్‌లకు సందేశాలు పంపుతున్నారు. ఆ సందేశాలను క్లిక్‌ చేయగానే. బాధితుల ఫోన్‌ హ్యాక్‌ చేసి అందులో ఉన్న నంబర్లు, ఫేస్‌బుక్‌ మిత్రులకు అత్యవసరంగా డబ్బు కావాలంటూ అభ్యర్థనలు పంపుతున్నారు. నగదు జమ కాగానే వాట్సాప్‌ నంబరును తొలగిస్తున్నారు.

కురుక్షేత్రకు వెళితే..

తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని హైదరాబాద్‌ యువతి ఒకరు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆ నంబర్‌ను చూసి హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్ర నుంచి సందేశాలు, చిత్రాలు వస్తున్నాయని గుర్తించి నిందితుడిని పట్టుకోడానికి అక్కడికి వెళ్లారు. కాని ఆ యువకుడు ఓ బేకరీలో పనివాడు. యజమాని ఇచ్చిన సెకెండ్‌హ్యాండ్‌ ఫోన్‌ వాడుతున్నాడు. హైదరాబాద్‌ యువతికి ఎందుకు ఫోటోలు పంపుతున్నావని అడిగితే.. కొద్దిరోజుల క్రితం ఓ యువతి ఫోన్‌ చేస్తే ఓటీపీ చెప్పానని, అప్పటి నుంచి తన వాట్సప్‌ పనిచేయడంలేదని తెలిపాడు.

అందంతో ఆకర్షణ.. ఆపై బ్లాక్‌మెయిల్‌

యువకులు, వృత్తి నిపుణులు, వ్యాపారులను ఆకర్షించేందుకు సైబర్‌ నేరస్థులు తమ వాట్సప్‌ నంబర్లకు అందమైన అమ్మాయిలు, యువతుల ప్రొఫైల్‌ చిత్రాలను ఉంచుతున్నారు. మొదట సరసంగా సంభాషిస్తారు. తర్వాత రెచ్చగొట్టేలా చిత్రాలను పంపుతారు. ఛాటింగ్‌ చేస్తుండగానే మీ నంబరుకు ఓటీపీ వస్తుంది.. వెంటనే తనకు పంపించాలంటూ అభ్యర్థిస్తారు. ఒక్కసారి పంపితే ఇక అంతే! రకరకాలుగా బ్లాక్‌మెయిల్‌ చేసి నగదు బదిలీ చేయించుకుంటారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇలాంటి ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details