తెలంగాణ

telangana

ETV Bharat / crime

బీ అలర్ట్ : ఆడాళ్లు.. వాళ్లు సైబర్ మోసగాళ్లు

Cyber Crimes in Hyderabad : సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి పేట్రేగిపోతున్నాయి. ఇంటి పట్టున ఉండి కుటుంబానికి కాస్త చేయూతనిద్దామని చిన్నచిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు. వారి వలలో చిక్కుకుంటున్న మహిళలు లక్షలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. చివరకు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Cyber Crimes in Hyderabad
Cyber Crimes in Hyderabad

By

Published : Aug 1, 2022, 10:32 AM IST

  • బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు యోగశిక్షణ అవసరమంటూ మాదాపూర్‌లోని యోగ శిక్షకురాలికి ఫోన్‌కాల్‌ వచ్చింది. దానికి అవసరమైన అడ్వాన్స్‌ చెల్లించేందుకు బ్యాంకు ఖాతా, పాన్‌కార్డు వివరాలు తీసుకున్నారు. ఫోన్‌ పే ద్వారా తాము పంపే లింకుకు రూ.100 పంపమని కోరి.. ఆమె ఖాతా నుంచి రూ.3లక్షలు కాజేశారు.
  • హైటెక్‌ సిటీకి చెందిన విద్యార్థిని(20) బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమె మొబైల్‌ నంబరుకు ట్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ నుంచి సందేశం వచ్చింది. రూ.15,000 బిట్‌కాయిన్‌లో పెట్టుబడితో రూ.5.47లక్షలు సంపాదించవచ్చంటూ ఆశచూపారు. చదువు ఖర్చులు, కుటుంబానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆమె దశల వారీగా రూ.1.92లక్షలు పెట్టుబడి పెట్టారు. తన ఖాతాల్లో సొమ్ము నిల్వ ఉన్నట్టు కనిపిస్తున్నా. విత్‌డ్రా చేసుకునే వీల్లేకపోవటంతో మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • నిజాంపేట్‌కు చెందిన గృహిణి(39). బీటెక్‌ చదివినా కుటుంబ బాధ్యతలతో ఇంటికే పరిమితమయ్యారు. ఆమె వాట్సాప్‌ నంబర్‌కు సందేశం వచ్చింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకొని.. దుకాణ నిర్వాహకులకు చేరవేయాలి. రోజూ 10-30 నిమిషాలు సమయం వెచ్చిస్తే చాలు. రూ.500-1000 వరకూ సంపాదన ఉంటుందని సారాంశం. ఇది నిజమని భావించిన ఆమె మాయగాళ్లు పంపిన లింకుల ఆధారంగా లావాదేవీలు నిర్వహిస్తుండగా బ్యాంకు ఖాతాలోని రూ.5,22,064 కాజేశారు.

Cyber Crimes in Hyderabad : హైదరాబాద్‌ నగరంలో కుటుంబ ఖర్చులు అధికమవుతున్నాయి. ఆలుమగలిద్దరూ సంపాదిస్తే తప్ప గడవని పరిస్థితి. తమ చదువు, విజ్ఞానానికి అనుగుణంగా గృహిణులు టైలరింగ్‌, బ్యూటీషియన్‌, కేక్‌, చాక్లెట్‌, బిస్కెట్‌ తయారీ వంటి ఉపాధి అంశాలను ఎంచుకోవటం సాధారణం. ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగాక ఆ రంగాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయి. ట్యూషన్లు, సంగీతం, యోగ, నృత్యం, డిజిటల్‌ పనులు, ప్రకటనలు, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలు ఉపాధిగా మలచుకుంటున్నారు. ఇంట్లో ఉంటూనే ఖాళీ సమయాన్ని కేటాయిస్తూ ప్రతి నెలా రూ.10,000-40,000 వరకూ సంపాదిస్తున్నారు.

ఈ వెసులుబాటును మోసగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి మహిళలు, యువతులు లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు సంపాదన కోసం మేమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోమంటూ ఆశచూపుతున్నారు. మాయగాళ్ల వలలో చిక్కిన వారి నుంచి రూ.లక్షలు కొట్టేస్తున్నారు. రూ.50,000 పెట్టుబడితో ప్రతినెలా రూ.20,000 ఆదాయం వస్తుందని భావించిన సైబరాబాద్‌ పరిధిలో ఓ గృహిణి నగలు తాకట్టుపెట్టి మరీ ఆన్‌లైన్‌ పెట్టుబడి పెట్టారు. మోసపోయినట్టు గ్రహించి భర్తకు తెలిస్తే కోప్పడతారనే భయపడ్డారు. నగలు చోరీకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో గృహిణి చేసిన అప్పు తీర్చేందుకు నగలు విక్రయించినట్టు నిర్ధారించారు.

మౌనంగా ఉండొద్దు.. "కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచన మంచిదే. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే సందేశాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రకటనలను తేలిగ్గా నమ్మొద్దు. వాటిలో ఎంత వరకూ వాస్తవమనేది నిర్ధారించుకోవాలి. అక్కడ కనిపించే సంస్థల గురించి తెలుసుకోవాలి. పూర్తిగా వాస్తవమని గ్రహించిన తర్వాతే ముందడుగు వేయాలి. ప్రస్తుతం వస్తున్న సైబర్‌ కేసుల్లో ఉద్యోగం, వివాహం, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లలో మోసపోతున్న జాబితాలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. మోసపోయినట్టు గ్రహించగానే మౌనంగా ఉండొద్దు. ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులు లేదా 1930 నంబరుకు ఫిర్యాదు చేయండి." - జి.శ్రీధర్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్‌, సైబరాబాద్‌

ABOUT THE AUTHOR

...view details