Cyber Crime With Fake Apps: సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో నేరాలు చేస్తున్నారు. వినియోగదారుల బలహీనలతలను అవకాశంగా తీసుకుని నిలువు దోపిడీ చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ పేర్లతో నకిలీ యాప్‌లు తయారు చేసి జనం సొమ్ము కాజేస్తున్నారు. ఒకరు పెట్టుబడి పేరుతో.. మరొకరు బుకింగ్‌ల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు.. సైబర్ మాయలో పడేస్తున్నారు. ఓలా సంస్థ ఇటీవల స్కూటర్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇది అందరికీ దొరకటం లేదు. ఇదే అదనుగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్ సృష్టించారు.
కస్టమర్ కేర్ పేరుతో కాల్... ఆపై..
అసలు కంపెనీ యాప్ తరహాలోనే స్వల్ప మార్పులతో యాప్ తయారు చేసి జాతీయ బ్యాంకులో ఖాతాలు సృష్టించారు. అమాయకుల నుంచి బుకింగ్, ఇన్సూరెన్స్, డెలివరీల పేరిట వేలకు వేలు గుంజేస్తున్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి కస్టమర్ కేర్ పేరుతో కాల్ వస్తుంది. బుకింగ్ అమౌంట్, డౌన్ పేమెంట్ పేరుతో రూ.20 వేల వరకూ గుంజుతారు. ఆ సొమ్ము అందాక.. సేల్స్ మేనేజర్ పేరుతో ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ వస్తుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ రుసుం పేరిట మరో రూ.20 వేల వరకూ వసూలు చేస్తారు. వినియోగదారుడు తాను మోసపోయానని గుర్తించే వరకూ అలా ఏదో ఒక పేరు చెప్పి డబ్బు గుంజుతూనే ఉంటారు. వినియోగదారుడు గట్టిగా నిలదీస్తే.. వెంటనే ఫోన్లు స్విచ్చాఫ్ అయిపోతాయి.