దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అంటూ సైబర్ నేరస్తులు కొత్తరకమైన మోసాలకు(cyber crime telangana) తెరలేపుతున్నారు. కారు వంటివి బహుమతిగా వచ్చాయని ఎరవేసి.. ఆ లింకులు పలువురికి షేర్ చేయాలని కోరుతారు. అలా రోజుకో తీరుగా నగదు కాజేస్తున్నారు. ఇటువంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త
తాజాగా అమెజాన్, టాటా గ్రూప్ పేరుతో వాట్సాప్ లింక్స్ పంపుతున్నారు. వాట్సాప్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేయగానే... కారు గెలుచుకున్నారని చెబుతారు. ఆ కారు తీసుకునేందుకు వాట్సాప్ గ్రూపుల్లో పంపాలని అంటున్నారు. తర్వాత లింకులు పంపించి మదుపు చేయాలని రూ.లక్షలు నగదును బదిలీ చేసుకుంటున్నారని(cyber crime telangana) సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటువంటి లింకులపై క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు.
అమెజాన్ పేరుతో జాబ్ల్ అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. కింద కాంటాక్టు అంటూ ఒక నంబర్ ఇస్తున్నారు. ఆ నంబర్‌పై క్లిక్ చేయగానే డైరెక్టు వాట్సాప్‌కు పోతుంది. వెంటనే ఆర్ యూ ఇంట్రెస్ట్ ఆన్ ఎర్న్ మనీ అని మెసేజ్ వస్తుంది. ఎస్ అంటే ఒక లింకు పంపుతారు. అలా టాస్కులు ఇస్తారు. ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని నమ్మిస్తారు. తొలుత ఆ డబ్బులను వాడుకునే సౌకర్యం కల్పిస్తారు. తర్వాత రూ.10వేలు దాటితే వాడుకోవడానికి వీలు ఉండదు. ఇలా ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేయిస్తారు. కొంతకాలం తర్వాత ఆ యాప్ బాధితుల ఫోన్లలో బ్లాక్ అవుతుంది. ఇటువంటి లింకులను క్లిక్ చేయకుండా ఉండాలి.