కరోనా నేపథ్యంలో రెమ్‌డెసివర్, టొసిలిజుమాబ్కు ఎక్కువ అవసరం ఉంటుంది. దీనిని ఆసరగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌లో అధిక ధర ఉండడంతో బాధితులు తేలిగ్గా వారి చేతికి చిక్కుతున్నారు. రూ.లక్షల్లో నగదు బదిలీ చేసుకుని ఫోన్లు ఆపేస్తున్నారు. కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లలో ఈ తరహాలో మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లలో ప్రకటనలను పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆ వెబ్‌సైట్‌లో
బర్కత్‌పురలో ఓ యువకుడి సోదరుడికి కరోనా సోకింది. అయిదు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసరంగా టొసిలిజుమాబ్ సూది మందు కావాలని వైద్యులు సూచించారు. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. స్నేహితుడి సూచన మేరకు ఇండియామార్ట్ వెబ్‌సైట్‌లో శోధించగా తొలుత లేదని కనిపించింది. తరవాత రెండు నిమిషాలకే అతడికి వాట్సాప్ కాల్ వచ్చింది. తాను ఇండియా హెల్త్ సైన్సెస్ నుంచి మాట్లాడుతున్నానని, తన వద్ద టొసిలిజుమాబ్ ఇంజక్షన్లు రెండు డోసులున్నాయని చెప్పాడు. రూ.1.10 లక్షలు పంపితే... రెండు గంటల్లో బెంగళూరు నుంచి విమానంలో పంపుతానని చెప్పాడు. వెంటనే ఆ నగదు బదిలీ చేసినా, సూదిమందు రాలేదు. మోసగాడి ఫోన్ ఆపేసినట్లు రావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
6 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు రూ.24 వేలకు అనడంతో
సికింద్రాబాద్ నివాసి ఒకరు కరోనా బారిన పడ్డాడు. పరిస్థితి తీవ్రం కావడంతో రెమ్‌డెసివిర్ కావాలంటూ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. మెడికల్ షాపుల్లో ఎక్కడా లభించలేదు. ఆయన కుమారుడు వెబ్‌సైట్లు చూస్తుండగా.. లైఫ్‌కేర్ సొల్యూషన్ వైబ్‌సైట్‌లో ఆరు ఇంజక్షన్లు రూ.24 వేలకే ఇస్తామంటూ ప్రకటన కనిపించింది. అక్కడ పేర్కొన్న ఫోన్ నంబరును సంప్రదించగా, ఆరు గంటల్లో పంపుతామని చెప్పాడు. బాధితుడు రూ.50 వేలు బదిలీ చేశాడు. 8 గంటల తర్వాత ఆ నంబరుకు ఫోన్ చేయగా ఆపేసి ఉంది.